ప్ర‌జలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యం

– ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సేవలపై నిరంత‌ర ప‌ర్య‌వేక్ష‌ణ‌
– డీఎంహెచ్‌వో డా. ఎ.శ్రావణ బాబు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
ఎన్టీఆర్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (డీఎంహెచ్‌వో) డాక్టర్ ఎ.శ్రావణ బాబు బుధవారం గంపలగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి, ఆసుపత్రిలో అందిస్తున్న వైద్య సేవలు, సిబ్బంది పనితీరు, వివిధ ఆరోగ్య కార్యక్రమాల అమలును క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ముందుగా సిబ్బంది హాజరు వివరాలు, రోగుల నమోదు రిజిస్టర్లను తనిఖీ చేశారు. అనంతరం ఆసుపత్రి లేబొరేట‌రీని సందర్శించి రోజువారీగా నిర్వహిస్తున్న రక్త పరీక్షల సంఖ్య, రక్త నమూనాల సేకరణ, పరీక్షల ఫలితాలను రోగులకు సకాలంలో అందిస్తున్న తీరును పరిశీలించారు. అనంతరం ఔషధాల విభాగాన్ని తనిఖీ చేసి మందుల లభ్యత, రోగులకు పంపిణీ చేస్తున్న మందుల వివరాలు, మందుల నిల్వ రిజిస్టర్లు, సంబంధిత రిజిస్టర్లను పరిశీలించారు. కనీసం మూడు నెలలకు సరిపడా మందుల నిల్వలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి ఆదేశించారు. అదేవిధంగా వ్యాధి నిరోధక టీకాల నిల్వలు, వాటిని భద్రపరిచే విధానం, కోల్డ్ చైన్ నిర్వహణ, సంబంధిత రిజిస్టర్ల నమోదు విధానాన్ని పరిశీలించారు. ఆసుపత్రి పరిసరాల పరిశుభ్రత, తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్ల పరిశుభ్రత, ఆసుపత్రి ఆవరణలో పచ్చదనం తదితర అంశాలను పరిశీలించారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు ఆహ్లాదకరమైన, పరిశుభ్రమైన వాతావరణంలో మెరుగైన వైద్య సేవలు అందించేలా సిబ్బంది నిరంతరం కృషి చేయాలని సూచించారు. ఈ తనిఖీలో గంపలగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ శృతి, ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు.