రూ.279 కోట్లకు చేరిన ఈహెచ్‌ఎస్‌ చెల్లింపులు

-ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు నెట్వర్క్ ఆసుపత్రుల ఖాతాలకు జమ
-మంత్రి సత్యకుమార్ యాదవ్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్టు ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్‌ఎస్‌) కింద నెట్‌వర్క్ ఆసుపత్రులకు తాజాగా రూ.78.32 కోట్లను చెల్లించింది. దీంతో 2026–27 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు చెల్లింపులు చేసిన మొత్తం రూ.279 కోట్లకు చేరింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు ఈ పథకం కింద మొత్తం రూ.768 కోట్లను చెల్లించింది. ఇందులో 2024–25 ఆర్థిక సంవత్సరంలో రూ.135 కోట్లు, 2025–26లో రూ.354 కోట్లు, 2026–27 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు రూ.279 కోట్లు చెల్లించినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు.

నెట్‌వర్క్ ఆసుపత్రులకు చెల్లింపులపై ఉన్న అనిశ్చితిని తొలగిస్తూ, క్రమం తప్పకుండా చెల్లింపులు చేసే విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందని మంత్రి పేర్కొన్నారు. తద్వారా ఉద్యోగులకు నెట్‌వర్క్ ఆసుపత్రుల ద్వారా మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.