రాజ్యాంగ విలువల ఆచరణే ప్రజాస్వామ్యానికి పునాది…

– విశిష్ట రాజ్యాంగ ఆశయాల సాధనకు ప్రతి పౌరుడు కట్టుబడి ఉండాలి
– జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
భార‌త మ‌హోన్న‌త రాజ్యాంగం కల్పించిన హక్కులను తెలుసుకోవడంతో పాటు రాజ్యాంగం నిర్దేశించిన బాధ్యతలను ప్రతి పౌరుడు నిబద్ధతతో పాటించాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ పిలుపునిచ్చారు. రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్య స్ఫూర్తి, సమానత్వం, న్యాయం, సౌభ్రాతృత్వ భావాలను ప్రతిఒక్కరూ తమ జీవితాల్లో ఆచరించాలని పేర్కొన్నారు.
గురువారం భార‌త రాజ్యాంగ దినోత్స‌వం సంద‌ర్భంగా క‌లెక్ట‌రేట్ శ్రీ పింగ‌ళి వెంక‌య్య స‌మావేశ మందిరంలో ప్ర‌త్యేక కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ వేడుక‌ల్లో క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ అధికారుల‌తో క‌లిసి పాల్గొన్నారు. భార‌త రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్‌.అంబేద్క‌ర్ చిత్ర‌ప‌టానికి పూల‌మాల‌లు వేసి నివాళులు అర్పించారు. రాజ్యాంగ పీఠికను చదివి రాజ్యాంగ ఆశయాలు, విలువలకు కట్టుబడి ఉండాలని ప్రతిజ్ఞ చేశారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ రాజ్యాంగం దేశ ప్రజలకు సమాన హక్కులు, స్వేచ్ఛ, న్యాయం కల్పిస్తూ ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాదిగా నిలుస్తుందని పేర్కొన్నారు. రాజ్యాంగంలోని ప్రాథమిక సూత్రాలను గౌరవిస్తూ, దేశ సమగ్రత, ఐక్యతను కాపాడేందుకు ప్రతిఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రాజ్యాంగ రూపకల్పనలో భాగస్వాములైన మహనీయుల సేవలను స్మరించుకుంటూ, రాజ్యాంగ లక్ష్యాల సాధనకు కృషిచేయాలని క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ పిలుపునిచ్చారు. కార్య‌క్ర‌మంలో డీఆర్‌వో ఎం.ల‌క్ష్మీన‌ర‌సింహం, క‌లెక్ట‌రేట్ ఏవో ఎస్‌.శ్రీనివాస‌రెడ్డి, క‌లెక్ట‌రేట్ వివిధ సెక్ష‌న్ల అధికారులు త‌దిత‌రులు పాల్గొన్నారు.