-యువత నైపుణ్య శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి: జిల్లా ఉపాధి అధికారి చల్లా మధుభూషణరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
వృత్తి నైపుణ్య శిక్షణ ద్వారా యువత మెరుగైన ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకోవచ్చని జిల్లా ఉపాధి అధికారి చల్లా మధుభూషణరావు, సీడప్ జిల్లా జేడీఎం నూకని ప్రశాంత్ కుమార్ నాయుడు అన్నారు.
గొల్లపూడిలోని లక్ష్మీదీప శిక్షణ కేంద్రంలో గురువారం నిర్వహించిన తల్లిదండ్రులు–ఉపాధ్యాయుల సమావేశానికి వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీడప్ ఆధ్వర్యంలో అమలవుతున్న వివిధ పథకాల ద్వారా గ్రామీణ యువతకు అందిస్తున్న నైపుణ్య శిక్షణ, ఉద్యోగ అవకాశాల గురించి విద్యార్థులు, తల్లిదండ్రులకు వివరించారు.
గతంలో శిక్షణ పొందిన పలువురు అభ్యర్థులు ఉద్యోగాలు సాధించి జీవితంలో స్థిరపడిన విజయగాథలను వివరించి విద్యార్థుల్లో ప్రోత్సాహం కల్పించారు. అనంతరం విద్యార్థులకు ఏకరూప దుస్తులు, ఇతర అవసరమైన వస్తువులతో కూడిన కిట్లను అందజేశారు.
అనంతరం శిక్షణ కేంద్రంలో విద్యార్థులకు కల్పిస్తున్న వసతి, భోజన సదుపాయాలను తల్లిదండ్రులతో కలిసి పరిశీలించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేసి వారి సమస్యలు, సౌకర్యాల గురించి తెలుసుకున్నారు.
