-సుస్థిర పట్టణాభివృద్ధి, ఆధునిక నగర పాలనపై అంతర్జాతీయ ప్రతినిధులతో చర్చలు
ముంబై, నేటి పత్రిక ప్రజావార్త:
అఖిల భారత స్థానిక స్వపరిపాలన సంస్థ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ముంబైలోని ఫెయిర్మాంట్లో నిర్వహిస్తున్న మూడో ప్రపంచ మేయర్ల వేదిక–2026 అంతర్జాతీయ సదస్సు రెండో రోజు కార్యక్రమాల్లో గుంటూరు నగర మేయర్ కోవెలమూడి లక్ష్మీ అపర్ణ, నగరపాలక సంస్థ కమిషనర్ కె. మయూర్ అశోక్ పాల్గొన్నారు.
నవంబర్ 26న జరిగిన ఈ సదస్సులో వివిధ దేశాల మేయర్లు, నగర పాలకులు, విధాన నిర్ణేతలు, పట్టణాభివృద్ధి నిపుణులతో కలిసి పట్టణాల అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చల్లో భాగస్వాములయ్యారు.
నగరాల భద్రత, సుస్థిర రవాణా వ్యవస్థ, ఆధునిక మౌలిక సదుపాయాలు, కాలుష్య నియంత్రణ, వాతావరణ మార్పుల ప్రభావాలను ఎదుర్కోవడం, ఇంధన పరివర్తన, నదీ ఆధారిత పట్టణాభివృద్ధి, క్రీడల ద్వారా ఆరోగ్యకరమైన నగరాల నిర్మాణం వంటి అంశాలపై సాంకేతిక సమావేశాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా అంతర్జాతీయ నగర పాలనలో అమలవుతున్న ఉత్తమ విధానాలను మేయర్, కమిషనర్ తెలుసుకున్నారు. గుంటూరు నగరాన్ని ఆధునికంగా, పర్యావరణహితంగా, సుస్థిరంగా తీర్చిదిద్దేందుకు ఉపయోగపడే అంశాలపై వివిధ దేశాల ప్రతినిధులతో అభిప్రాయాలు పంచుకున్నారు.
అంతర్జాతీయ సదస్సులో లభించిన అనుభవాలు, నూతన ఆలోచనలు గుంటూరు నగర అభివృద్ధికి, మెరుగైన పౌర సేవల కల్పనకు దోహదపడతాయని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.
