ఎపి సచివాలయంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
ఎపి సచివాలయం మొదటి భవనం ముఖ్యమంత్రి కార్యాలయ ఆవరణలో గురువారం భారత రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు.1949 నవంబరు 26వ తేదీన కానిస్టిట్యుయెంట్ అసెంబ్లీ ఆఫ్ ఇండియా కానిస్టిట్యూషన్ ఆప్ ఇండియాను అడాప్ట్ చేసుకోగా 1950 నవంబరు 26 నుండి భారత రాజ్యాంగం అమలులోకి వచ్చింది.ఆనాటి నుండి ప్రతి ఏటా నవంబరు 26వ తేదీన దేశ వ్యాప్తంగా రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తోంది.సచివాలయంలో జరిగిన రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమంలో సర్వీసెస్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్.రావత్,సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.సురేశ్ కుమార్,ఐఅండ్పిఆర్ డైరెక్టర్ కెఎస్.విశ్వనాధన్ పాల్గొని కార్యక్రమంలో పాల్గొన్న సచివాలయ అధికారులు,ఉద్యోగులతో రాజ్యాంగ పీఠికను తెలుగులో పఠించారు.
ఈ సందర్భంగా న్యాయం స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం అనే రాజ్యాంగ మౌలిక ఆదర్శాల ప్రాధాన్యతను వివరించారు.అధికారులు ఉద్యోగులు తమ విధుల నిర్వహణలో ప్రతి సందర్భంలోనూ రాజ్యాంగ స్ఫూర్తిని ప్రతిబింబిస్తూ రాజ్యాంగం నిర్దేశించిన విలువలను ఆచరణలో పెట్టాలని ఆకాంక్షించారు.ప్రజలకు సేవలందించే క్రమంలో రాజ్యాంగ సూత్రాలు చట్ట బద్ధమైన విధానాలు నిష్పాక్షికత పారదర్శకత జవాబుదారీతనానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు.పౌరుల హక్కులను పరిరక్షిస్తూ రాజ్యాంగ వ్యవస్థకు అనుగుణంగా తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని ప్రభుత్వ ఉద్యోగులకు సూచించారు.
రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమం రాజ్యాంగంలో పొందుపరిచిన ఆదర్శాల పట్ల అధికారులు ఉద్యోగుల నిబద్ధతను పునరుద్ఘాటించింది.రాజ్యాంగ విలువలను కేవలం సిద్ధాంతాలకే పరిమితం చేయకుండా పరిపాలనా నిర్ణయాల్లోనూ ప్రజా సేవలోనూ ఆచరణలో ప్రతిబింబింప జేయాల్సిన ఆవశ్యకతను ఈ కార్యక్రమం గుర్తు చేసింది.
ఈకార్యక్రమంలో ప్రోటోకాల్ విభాగం సంయుక్త కార్యదర్శి రామసుబ్బయ్య తోపాటు సాధారణ పరిపాలన శాఖ సహా ఇతర శాఖల అధికారులు,ఉద్యోగులు పాల్గొన్నారు.