మడతలో మతలబు

    -వెంకటగిరి ఎంపీపీ ఎన్నికలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు – ఎంపీ గురుమూర్తి
    -ప్రలోభాలు, బెదిరింపులకు లొంగకుండా జగనన్న వెంటే నిలిచిన నలుగురు ఎంపీటీసీలకు అభినందనలు

    తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త:

    మడతల్లో మతలబు చేసి వెంకటగిరి రూరల్ మండల ఎంపీపీ ఎన్నికలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంకటగిరి రూరల్ మండల ఎంపీపీ ఎన్నికలో ఇరు పార్టీలకు సమాన సభ్యుల బలం ఉండటంతో డ్రా ద్వారా ఎంపీపీ ఎన్నిక నిర్వహించినప్పటికీ, ఆ ప్రక్రియలో అధికార పార్టీ అక్రమాలకు పాల్పడిందని ఆయన పేర్కొన్నారు.

    ఈ ప్రక్రియలో పేపరుపై పేర్లు రాసే విధానం, అభ్యర్థుల పేర్లను టీడీపీ అభ్యర్థులవి ఓ రకంగా, వైసీపీ అభ్యర్థులవి ఓ రకంగా రాయడం, పత్రాలను మడిచే విధానం వంటి అంశాలపై తమ అభ్యర్థులు అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ అధికారులు వాటిని పట్టించుకోలేదని ఎంపీ తెలిపారు. తమ పార్టీ సభ్యులను ఎన్నికల ప్రక్రియలో పాల్గొనకుండా అడ్డుకోవడం, తనను సైతం ఎన్నికల హాలులోకి అనుమతించకపోవడం వెనుక ఎన్నికను అధికార పార్టీకి అనుకూలంగా నిర్వహించాలనే ఉద్దేశం ఉందని విమర్శించారు. ఈ పరిణామాల మధ్య జరిగిన ఎన్నిక ప్రజాస్వామ్యబద్ధమైన ఎన్నిక కాదని, అక్రమ మార్గాల్లో సాధించిన గెలుపు నిజమైన గెలుపు కాదని అన్నారు.

    వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచి, ఎన్ని ప్రలోభాలు పెట్టినా, ఎన్ని బెదిరింపులకు గురిచేసినా వెనుకడుగు వేయకుండా జగనన్న వెంట, వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త రామ్ కుమార్ రెడ్డి వెంటే నిలిచిన నలుగురు ఎంపీటీసీ సభ్యులకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నానని ఎంపీ గురుమూర్తి అన్నారు. ఎన్నికల సమయంలో తాను ప్రత్యక్షంగా అక్కడే ఉండి పరిస్థితులను గమనించానని, అధికార పార్టీ నాయకులు తమ సభ్యులను వారి వైపు తిప్పుకునేందుకు తీవ్ర ఒత్తిళ్లు తీసుకొచ్చినప్పటికీ వారు ఏమాత్రం భయపడకుండా, బెదరకుండా నిలబడటం అభినందనీయమని పేర్కొన్నారు.

    ప్రశాంతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా నిన్ననే పూర్తికావాల్సిన వెంకటగిరి రూరల్ మండల ఎంపీపీ ఎన్నికను ఏదో ఒక కారణం చూపుతూ వాయిదా వేయడం అన్యాయమని ఎంపీ గురుమూర్తి విమర్శించారు. ఈరోజు ఎన్నిక సమయంలో కూటమి ఎమ్మెల్యే కూడా అక్కడికి వచ్చి, తమ అభ్యర్థుల చేత ఎంపీ హాలులో ఉండటం వల్ల తాము భయపడుతున్నామని, స్వేచ్ఛగా ఓటు వేయలేకపోతున్నామని ఫిర్యాదు చేయించడం హాస్యాస్పదమన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వానికి, ఎమ్మెల్యేలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అంటే ఎందుకంత భయమని మీడియా ముఖంగా ప్రశ్నించారు.

    వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిష్పక్షపాతంగా ఎన్నిక జరగాలని కోరిందని, అయితే ఎన్నికల ప్రక్రియలో అక్రమాలు జరిగాయని తెలిపారు. ఎన్నికల అధికారిని కూటమి నాయకులు ప్రలోభాలకు గురిచేయడం, బెదిరించడం వంటి చర్యలకు పాల్పడినట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తుందని, దీనికి సంబంధించిన ఆధారాలు కూడా తమ వద్ద ఉన్నాయని పేర్కొన్నారు. ఎన్నికల సంఘం ఈ అంశాలన్నింటినీ పరిశీలించి, తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

    రాష్ట్రవ్యాప్తంగా లాటరీ విధానంలో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులే గెలవడం వెనుక అనేక అనుమానాలు ఉన్నాయని, ఇది ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన ఎన్నికలా లేక అధికార పార్టీకి అనుకూలంగా జరిగిన ఎంపికలా అని ప్రశ్నించారు. ప్రజలంతా ఈ పరిణామాలను గమనిస్తున్నారని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న కూటమి ప్రభుత్వానికి రాబోయే ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నానని ఎంపీ గురుమూర్తి అన్నారు.