-ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి – APSRTC జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ ఎం. శివ ప్రసాద్, ఐఎఫ్ఎస్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
ఆర్టీసీ డిపోల సమర్థవంతమైన నిర్వహణతో పాటు సంస్థ ఆస్తులు, ఆదాయ పరిరక్షణకు డిపో మేనేజర్లు అత్యంత ప్రాధాన్యతనివ్వాలని, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు, నాణ్యమైన రవాణా సేవలు అందించేందుకు కృషి చేయాలని APSRTC జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ ఎం. శివ ప్రసాద్, ఐఎఫ్ఎస్ సూచించారు.
విజయవాడలోని RTC హౌస్‌లో డిపో మేనేజర్లకు నాలుగు బ్యాచ్‌లుగా నిర్వహించిన ప్రత్యేక శిక్షణా కార్యక్రమం ముగింపు సందర్భంగా శుక్రవారం ఆయన మాట్లాడారు. డిపో అనేది సంస్థ కార్యకలాపాలకు కీలక కేంద్రం మాత్రమే కాకుండా, సంస్థ ఆదాయం, పనితీరు, సేవల నాణ్యతను ప్రభావితం చేసే ముఖ్యమైన విభాగమని పేర్కొన్నారు. ప్రతి డిపో మేనేజర్ బాధ్యతాయుతంగా, అంకితభావంతో విధులు నిర్వహిస్తూ సంస్థ అభివృద్ధికి తోడ్పడాలని పిలుపునిచ్చారు.
డిపో పరిధిలోని బస్సులు, భవనాలు, యంత్ర పరికరాలు, విద్యుత్ పరికరాలు, ఇతర మౌలిక సదుపాయాలను సమర్థవంతంగా వినియోగిస్తూ వాటి పరిరక్షణకు ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. బస్సుల నిర్వహణ, మరమ్మతులు, బ్రేక్డౌన్ల నివారణ, పరిశుభ్రతపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని తెలిపారు. ముఖ్యంగా ప్రయాణ మార్గాల్లో బస్సులు నిలిచిపోకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, విద్యుత్ బస్సుల నిర్వహణలోనూ నూతన సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెంపొందించుకోవాలని చెప్పారు.
అలాగే బస్ స్టేషన్లలో ప్రయాణికులకు సురక్షితమైన తాగునీరు, కూర్చునే సదుపాయాలు, పరిశుభ్రమైన మరుగుదొడ్లు, విశ్రాంతి గదులు అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశించారు. బస్ స్టేషన్లు, డిపో ప్రాంగణాల పరిశుభ్రతకు ప్రాధాన్యతనిస్తూ ప్రయాణికులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన వాతావరణం కల్పించాలని స్పష్టం చేశారు.
సంస్థ ఆదాయానికి నష్టం కలిగించే ఆర్థిక, సాంకేతిక అక్రమాలను ముందుగానే గుర్తించి అరికట్టాలని జేఎండీ సూచించారు. డిపో రికార్డులు, రిజిస్టర్లు, ఆర్థిక లావాదేవీలు, రోజువారీ ఆదాయ వివరాలు, సిబ్బంది విధుల నిర్వహణను ఎప్పటికప్పుడు పరిశీలించాలని తెలిపారు. కేవలం సిబ్బంది నివేదికలపై ఆధారపడకుండా సమాచారాన్ని క్షేత్రస్థాయిలో ధృవీకరించాలని, అనుమానాస్పద లావాదేవీలు, వ్యత్యాసాలు గుర్తించిన వెంటనే చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. అక్రమాలు జరిగిన తరువాత స్పందించడం కంటే, అవి జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడమే ముఖ్యమని ఉద్ఘాటించారు.
రాష్ట్ర అభివృద్ధి, APSRTC పురోగతి కోసం ముఖ్యమంత్రి ఆశయాలు, దార్శనికతకు అనుగుణంగా అధికారులు, సిబ్బంది సమష్టిగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. సంస్థ అభివృద్ధిని ప్రతి ఉద్యోగి తన బాధ్యతగా భావించి ప్రజలకు మరింత మెరుగైన రవాణా సేవలు అందించాలని సూచించారు.
125 మంది డిపో మేనేజర్లకు ప్రత్యేక శిక్షణ
APSRTC ట్రాన్స్పోర్ట్ అకాడమీ, సంస్థ ప్రధాన కార్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో నవంబర్ 10 నుంచి 20వ తేదీ వరకు నాలుగు బ్యాచ్‌లుగా ఈ ప్రత్యేక శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా 125 మంది డిపో మేనేజర్లు ఇందులో పాల్గొన్నారు. పర్సనల్, అకౌంట్స్, మెకానికల్, ఆపరేషన్స్, కమర్షియల్ అండ్ లాజిస్టిక్స్, ఐటీ తదితర విభాగాలకు సంబంధించిన అంశాలపై ఉన్నతాధికారులు, నిపుణులు అవగాహన కల్పించారు. డిపోల రోజువారీ కార్యకలాపాల నిర్వహణ, ఆర్థిక లావాదేవీలు, రికార్డుల నిర్వహణ, తనిఖీ విధానాలు, లోపాల గుర్తింపు, నివారణ చర్యలపై సమగ్ర శిక్షణ అందించారు.
ఈ కార్యక్రమంలో APSRTC ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు (అడ్మినిస్ట్రేషన్) కె.ఎస్. బ్రహ్మానంద రెడ్డి, (ఇంజనీరింగ్) జి.వి. రవి వర్మ, (ఆపరేషన్స్) ఎస్.టి.పి. రాఘవ కుమార్‌తో పాటు సంస్థలోని వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.
సంస్థలో ఆర్థిక క్రమశిక్షణను బలోపేతం చేయడం, అక్రమాలను అరికట్టడం, ఆస్తులు, ఆదాయాన్ని పరిరక్షించడం, డిపోల నిర్వహణ సామర్థ్యాన్ని పెంపొందించడం, ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడం ఈ శిక్షణా కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు.
