-ముంబైలో నవంబర్ 25 నుంచి 27 వరకు అంతర్జాతీయ స్థాయి సమావేశాలు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త:
ముంబైలో జరగనున్న 3వ వరల్డ్ మేయర్స్ ఫోరం–2026లో గుంటూరు నగర మేయర్ కోవెలమూడి లక్ష్మీ అపర్ణ, నగర కమిషనర్ కె. మయూర్ అశోక్ పాల్గొననున్నారు. ఈ నెల 25 నుంచి 27వ తేదీ వరకు ముంబైలోని ఫెయిర్మాంట్ హోటల్లో ఈ అంతర్జాతీయ సదస్సు జరగనుంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ పురపాలక పరిపాలన శాఖ కమిషనర్, డైరెక్టర్ డాక్టర్ పి. సంపత్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ (AIILSG) శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ వరల్డ్ మేయర్స్ ఫోరంను నిర్వహిస్తున్నారు. 1926లో స్థాపించబడిన ఈ సంస్థ శిక్షణ, పరిశోధన, సంస్థాగత అభివృద్ధి, పట్టణ పాలన తదితర రంగాల్లో విశేష సేవలందిస్తూ వందేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ అంతర్జాతీయ సమావేశాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది.
ఈ ఫోరంలో పట్టణాభివృద్ధిలో మహిళా నాయకత్వం, లింగ సమానత్వం, ఆర్థిక చేరిక వంటి కీలక అంశాలపై చర్చలు జరగనున్నాయి. వృత్తిపరమైన శిక్షణ, సామర్థ్య నిర్మాణం, పరిశోధన, సంస్థాగత అభివృద్ధి, సమర్థవంతమైన పట్టణ పాలన ద్వారా స్థానిక స్వపరిపాలన వ్యవస్థలను మరింత బలోపేతం చేసే అంశాలపై వివిధ దేశాల ప్రతినిధులు తమ అభిప్రాయాలను పంచుకోనున్నారు.
ఈ అంతర్జాతీయ సదస్సుకు భారత్‌తో పాటు ప్రపంచంలోని వివిధ నగరాలకు చెందిన మేయర్లు, నగర పాలక సంస్థల ప్రతినిధులు, విధాన రూపకర్తలు, విద్యావేత్తలు, పట్టణాభివృద్ధి నిపుణులు, అభివృద్ధి భాగస్వాములు కలిపి 1,000 మందికి పైగా హాజరవుతారని అంచనా వేస్తున్నారు.
అలాగే నవంబర్ 27న పట్టణాభివృద్ధిలో మహిళా నాయకత్వం, లింగ సమానత్వం, ఆర్థిక చేరిక అంశాలపై ప్రత్యేక మహిళా నాయకత్వ వర్క్‌షాప్ నిర్వహించనున్నారు.
ఆంధ్రప్రదేశ్ నుంచి సుమారు 25 మంది ప్రతినిధులు ఈ ఫోరంలో పాల్గొనేందుకు పురపాలక పరిపాలన శాఖ నామినేట్ చేసింది. వీరిలో మేయర్లు, మున్సిపల్ చైర్పర్సన్లు, మున్సిపల్ కమిషనర్లు ఉన్నారు.
అంతర్జాతీయ స్థాయి వేదికపై గుంటూరు నగరానికి ప్రాతినిధ్యం వహించనున్న మేయర్, కమిషనర్ పట్టణాభివృద్ధి, నగర పాలనకు సంబంధించిన అంశాలపై జరిగే చర్చల్లో పాల్గొననున్నారు.
