-కౌంటర్లు దాఖలులో జాప్యం చేయొద్దు – గుంటూరు నగర కమిషనర్ మయూర్ అశోక్
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త:
నగరపాలక సంస్థకు సంబంధించిన కోర్టు కేసుల నిర్వహణపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రతి విభాగాధిపతి తమ పరిధిలోని కేసులను ప్రతిరోజూ సమీక్షించాలని నగర కమిషనర్ కె. మయూర్ అశోక్ ఆదేశించారు. సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో విభాగాధిపతులు, సూపరింటెండెంట్లతో ఆయన కోర్టు కేసులపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ న్యాయస్థానాల్లో దాఖలైన కేసులకు నిర్ణీత గడువులోగా కౌంటర్లు దాఖలు చేయాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ పెండింగ్‌లో ఉంచకూడదని స్పష్టం చేశారు. అవసరమైన సమాచారం, రికార్డులను సంబంధిత అధికారులు సకాలంలో లీగల్ సెల్‌కు అందజేయాలని సూచించారు. కోర్టు ఉత్తర్వులను తప్పనిసరిగా అమలు చేస్తూ కంటెంప్ట్ కేసులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
ముఖ్యంగా అత్యధిక కేసులు నమోదవుతున్న టౌన్ ప్లానింగ్ విభాగంలో కోర్టు కేసుల పర్యవేక్షణకు ప్రత్యేక సిబ్బందిని కేటాయించాలని ఆదేశించారు. ప్రతి కేసుకు సంబంధించిన న్యాయస్థానం పేరు, కేసు నంబర్, దాఖలైన తేదీ, తదుపరి విచారణ తేదీ, కౌంటర్ దాఖలు స్థితి తదితర వివరాలతో సమగ్ర రికార్డులు నిర్వహించాలని స్పష్టం చేశారు.
సమావేశంలో అదనపు కమిషనర్లు ఐ. కిషోర్, రవీంద్రబాబు, డిప్యూటీ కమిషనర్లు బి. శ్రీనివాసరావు, సీహెచ్. శ్రీనివాస్, సిటీ ప్లానర్ డి. రాంబాబు, ఎస్ఈ జి. వెంకటేశ్వరరావు, ఎంహెచ్ఓ డాక్టర్ సురేష్ బాబు, మేనేజర్ బాలాజీ బాషా తదితర అధికారులు పాల్గొన్నారు.
