ఏపీ సీఆర్డీఏలో గ్రీవెన్స్ డే.. 18 ఫిర్యాదుల స్వీకరణ

-రైతుల సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తాం – కమిషనర్ విజయ రామరాజు

అమరావతి, విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
రాజధాని రైతులు, స్థానికుల సమస్యల పరిష్కారం కోసం రాయపూడిలోని ఏపీ సీఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా సీఆర్డీఏ కమిషనర్ వి. విజయ రామరాజు, అడిషనల్ కమిషనర్లు ఏ. భార్గవతేజ, కొల్లాబత్తుల కార్తీక్, టి. రాహుల్ కుమార్ రెడ్డి రైతులు, స్థానికుల నుంచి అర్జీలు స్వీకరించారు. అందిన ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. కొన్ని సమస్యల పరిష్కారం ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని తెలిపారు.

ఈ గ్రీవెన్స్ డేలో మొత్తం 18 ఫిర్యాదులు అందగా, వాటిలో 12 భూ సంబంధిత, రెండు ప్లానింగ్ విభాగానికి చెందినవి కాగా, మిగిలినవి ఎస్టేట్స్, డెవలప్‌మెంట్ ప్రమోషన్, సోషల్ డెవలప్‌మెంట్ విభాగాలకు సంబంధించినవిగా అధికారులు వెల్లడించారు. రైతుల వార్షిక కౌలు చెల్లింపులకు సంబంధించి NPCI, బ్యాంకు ఖాతాల అనుసంధానం కోసం ప్రత్యేక హెల్ప్‌డెస్క్‌ను ఏర్పాటు చేశారు. పలువురు రైతులకు NPCI లింకేజీ ప్రక్రియను పూర్తి చేశారు. దీంతో వారి బ్యాంకు ఖాతాల్లో వార్షిక కౌలు జమ కావడానికి మార్గం సుగమమైంది.

రైతులు, స్థానికుల సౌకర్యార్థం సీఆర్డీఏ ప్రధాన కార్యాలయంలోని సిటిజన్ గ్రీవెన్స్ సెంటర్‌లో ప్రతి పనిదినం అర్జీలు స్వీకరిస్తామని అధికారులు తెలిపారు. ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు గ్రీవెన్స్ డే నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని రాజధాని రైతులు, స్థానికులు వినియోగించుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో సీఆర్డీఏకు చెందిన వివిధ విభాగాల ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.