విజయవాడ నగరపాలక సంస్థలో ఎన్డీఏ కూటమి చారిత్రాత్మక విజయం.. నగర అభివృద్ధికి సమష్టిగా కృషి చేస్తాం – ఎంపీ కేశినేని చిన్ని

-పార్టీ ఆవిర్భావం నుండి అనుబంధం.. కష్టకాలంలోనూ పార్టీ కోసం పోరాడిన కుటుంబానికి డిప్యూటీ మేయర్ పదవి ద్వారా సముచిత గౌరవం
-మేయర్ వంగవీటి రాధా, డిప్యూటీ మేయర్ చెన్నుపాటి కాంతిశ్రీ, నూతన కార్పొరేటర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని)

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
విజయవాడ నగరపాలక సంస్థలో ఎన్డీఏ కూటమి తరఫున నూతనంగా ఎన్నికైన మేయర్, డిప్యూటీ మేయర్ మరియు కార్పొరేటర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని) ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నూతన మేయర్ వంగవీటి రాధాకు ఎంపీ కేశినేని చిన్ని ఘనంగా స్వాగతం పలికి అభినందనలు తెలిపారు. డిప్యూటీ మేయర్‌గా ఎన్నికైన చెన్నుపాటి కాంతిశ్రీని కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మేయర్, డిప్యూటీ మేయర్, నూతన కార్పొరేటర్లతో కలిసి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) మాట్లాడుతూ విజయవాడ నగర ప్రజలు ఎన్డీఏ కూటమిపై చూపించిన అపారమైన ఆదరణ, విశ్వాసానికి నగరపాలక సంస్థ ఎన్నికల్లో లభించిన చారిత్రాత్మక విజయం నిదర్శనమని పేర్కొన్నారు. నగర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రజలు కూటమికి అద్భుతమైన మెజారిటీని అందించారని, ఈ విజయాన్ని ప్రజలు తమపై ఉంచిన నమ్మకానికి ప్రతిరూపంగా భావిస్తున్నామని తెలిపారు.

మేయర్ ప్రమాణ స్వీకారం అనంతరం కూటమి కార్పొరేటర్లందరూ ప్రమాణ స్వీకారం చేశారని, డిప్యూటీ మేయర్ ఎన్నికలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి చెన్నుపాటి కాంతిశ్రీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని వెల్లడించారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో రాష్ట్రంలో కొనసాగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలు విశ్వాసం వ్యక్తం చేశారని అన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ అందిస్తున్న అభివృద్ధి ఫలాలను గుర్తించిన ప్రజలు, విజయవాడలో ట్రిపుల్ ఇంజిన్ సర్కార్‌కు సంపూర్ణ మద్దతు, ఆశీర్వాదం అందించారని పేర్కొన్నారు.

*విజయవాడకు పూర్వవైభవం తీసుకురావడమే లక్ష్యం*

విజయవాడ నగరానికి పూర్వవైభవం తీసుకురావడమే ఎన్డీఏ కూటమి ప్రధాన లక్ష్యమని ఎంపీ కేశినేని చిన్ని స్పష్టం చేశారు. నగరంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, మెరుగైన రహదారుల నిర్మాణం, పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి సరఫరా, ప్రజలకు అవసరమైన ఇతర సౌకర్యాల కల్పనకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు.

మేయర్ వంగవీటి రాధా, డిప్యూటీ మేయర్ చెన్నుపాటి కాంతిశ్రీ, నూతన కార్పొరేటర్లందరూ సమన్వయంతో పనిచేస్తూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నగర అభివృద్ధికి కృషి చేస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ విజయవాడను రాష్ట్రంలోనే ఆదర్శ నగరంగా తీర్చిదిద్దేందుకు సమష్టిగా పనిచేస్తామని తెలిపారు.

*పార్టీ ఆవిర్భావం నుండి అనుబంధం.. పోరాట స్ఫూర్తికి దక్కిన సముచిత గౌరవం*

డిప్యూటీ మేయర్‌గా చెన్నుపాటి కాంతిశ్రీ ఎంపిక వెనుక ఉన్న ప్రత్యేక కారణాలను ఎంపీ కేశినేని చిన్ని వివరించారు. ఆమె కుటుంబానికి టీడీపీ ఆవిర్భావం నుండి పార్టీతో విడదీయరాని అనుబంధం ఉందని, తరతరాలుగా పార్టీ పట్ల అంకితభావం, నిబద్ధత, విశ్వాసంతో ఆ కుటుంబం పనిచేస్తోందని తెలిపారు.

2019–2024 మధ్య కష్టకాలంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అనేక ఇబ్బందులు, రాజకీయ వేధింపులు ఎదుర్కొన్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా చెన్నుపాటి కాంతిశ్రీ భర్త, సీనియర్ నాయకులు గాంధీ రాజకీయ కక్ష సాధింపు దాడుల్లో తీవ్రంగా నష్టపోయి ఒక కన్ను కోల్పోవడం అత్యంత బాధాకరమని అన్నారు.

అయినప్పటికీ ఆ కుటుంబం ఎలాంటి ఒత్తిళ్లకు వెనుకడుగు వేయకుండా పార్టీ కోసం ధైర్యంగా నిలబడి పోరాటం చేసిందని కొనియాడారు. పార్టీ పట్ల అచంచలమైన విశ్వాసం, అంకితభావం, పోరాట స్ఫూర్తి కలిగిన అటువంటి కుటుంబానికి సముచిత గుర్తింపు, గౌరవం కల్పించాలనే ఉద్దేశంతో చెన్నుపాటి కాంతిశ్రీ పేరును ప్రతిపాదించడం జరిగిందని వివరించారు.

ఆమె కుటుంబం పార్టీకి అందించిన సేవలు, సీనియారిటీ, పార్టీ పట్ల విధేయత, కష్టకాలంలో ప్రదర్శించిన పోరాట పటిమను గుర్తించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఆమె పేరును డిప్యూటీ మేయర్ పదవికి ప్రతిపాదించడం సముచిత నిర్ణయమని పేర్కొన్నారు.

పార్టీ కోసం కష్టకాలంలోనూ అండగా నిలిచిన నాయకులు, కార్యకర్తల సేవలను పార్టీ నాయకత్వం ఎప్పటికీ మరచిపోదని, వారికి తగిన గుర్తింపు, గౌరవం కల్పిస్తుందనే బలమైన సందేశాన్ని చెన్నుపాటి కాంతిశ్రీ ఎంపిక చాటిచెబుతోందని అన్నారు. ఈ నిర్ణయం పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని నింపుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

*ప్రజల నమ్మకమే బాధ్యత.. అభివృద్ధే మా ప్రాధాన్యత*

విజయవాడ నగర ప్రజలు అందించిన చారిత్రాత్మక విజయాన్ని ఎన్డీఏ కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులందరూ ఒక గొప్ప బాధ్యతగా స్వీకరించాలని ఎంపీ కేశినేని చిన్ని పిలుపునిచ్చారు. రాజకీయాలకు అతీతంగా ప్రజా సంక్షేమం, నగర అభివృద్ధే లక్ష్యంగా పనిచేయాలని అన్నారు.

విజయవాడకు పూర్వవైభవం తీసుకురావడంతో పాటు, రాష్ట్రంలోనే అత్యుత్తమ నగరంగా తీర్చిదిద్దేందుకు మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు, కూటమి నాయకులందరూ సమష్టిగా కృషి చేస్తారని తెలిపారు.

ఈ చారిత్రాత్మక విజయాన్ని అందించిన విజయవాడ నగర ప్రజలకు ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.