-ఐదేళ్లలో దాదాపు 9 లక్షల మంది భారత పౌరసత్వానికి దూరం
-మేధోసంపత్తి, పెట్టుబడులు, నైపుణ్యం, ఉపాధి అవకాశాలను కోల్పోతున్న దేశం
-పౌరసత్వం వదులుకుంటున్న వారి వివరాలు కూడా సేకరించలేని కేంద్ర ప్రభుత్వం తన వైఫల్యాన్ని అంగీకరించాలి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
భారతదేశానికి చెందిన లక్షలాది మంది పౌరులు తమ పౌరసత్వాన్ని వదులుకొని విదేశాల్లో స్థిరపడుతున్న పరిణామం దేశ భవిష్యత్తుపై తీవ్ర ఆందోళన కలిగిస్తోందని సీపీఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య పేర్కొన్నారు. ఐదేళ్లలో దాదాపు 9 లక్షల మంది భారత పౌరసత్వాన్ని వదులుకోవడం కేంద్ర ప్రభుత్వ ఆర్థిక, పాలనా విధానాలపై అనేక ప్రశ్నలను లేవనెత్తుతోందని విమర్శించారు.
పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం 2020 నుంచి 2024 వరకు మొత్తం 8,96,843 మంది భారత పౌరసత్వాన్ని వదులుకున్నారు. 2022లో 2,25,620 మంది, 2023లో 2,16,219 మంది, 2024లో 2,06,378 మంది పౌరసత్వాన్ని వదులుకోవడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోందన్నారు. ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు దేశాన్ని వీడుతున్నప్పటికీ వారి ఆదాయ స్థాయి, వృత్తులు, విద్యార్హతలు, ఆర్థిక నేపథ్యానికి సంబంధించిన వివరాలు కూడా తమ వద్ద లేవని కేంద్ర ప్రభుత్వం చెప్పడం బాధ్యతారాహిత్యమని విమర్శించారు.
దేశంలో పెరుగుతున్న నిరుద్యోగం, ఆర్థిక అసమానతలు, అవినీతి, పారిశ్రామిక రంగంలో గుత్తాధిపత్య ధోరణులు యువతకు, పారిశ్రామికవేత్తలకు ప్రతికూల పరిస్థితులను కల్పిస్తున్నాయని పేర్కొన్నారు. కార్పొరేట్ సంస్థలకు ప్రాధాన్యత ఇస్తూ చిన్న, మధ్యతరహా పరిశ్రమలను నిర్లక్ష్యం చేయడం వల్ల పారిశ్రామిక అభివృద్ధి, ఉపాధి కల్పన దెబ్బతింటున్నాయని ఆరోపించారు.
దేశం నుంచి వైద్యులు, ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు, పరిశోధకులు, సాంకేతిక నిపుణులు, పారిశ్రామికవేత్తలు విదేశాలకు తరలిపోవడం వల్ల విలువైన మానవ వనరులను భారత్ కోల్పోతోందన్నారు. దీనివల్ల వైద్యం, విద్య, వ్యవసాయం, పరిశోధన, పారిశ్రామిక రంగాలపై దీర్ఘకాలిక ప్రభావం పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశీయ విద్యాసంస్థల్లో ప్రజాధనంతో తయారైన నైపుణ్యవంతుల సేవలు ఇతర దేశాలకు ఉపయోగపడటం బ్రెయిన్ డ్రెయిన్‌కు నిదర్శనమన్నారు.
విదేశాల్లో స్థిరపడిన భారతీయులు పంపే విదేశీ చెల్లింపులు ఆర్థిక వ్యవస్థకు ఉపయోగపడుతున్నప్పటికీ, దేశం కోల్పోతున్న మేధోసంపత్తి, పెట్టుబడులు, పరిశోధనలు, పరిశ్రమలు, ఉపాధి అవకాశాల నష్టాన్ని అవి భర్తీ చేయలేవని స్పష్టం చేశారు.
ప్రపంచంలోనే అత్యధిక యువజనాభా కలిగిన దేశంగా ఉన్న భారత్‌లో యువతకు భవిష్యత్తుపై భరోసా కల్పించలేకపోవడం పాలకుల వైఫల్యం కాదా అని ప్రశ్నించారు. దేశంలోనే ప్రతిభావంతులు ఉండి పనిచేసేలా ఉపాధి, పరిశోధన, పారిశ్రామిక అవకాశాలను కల్పించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందన్నారు.
కేంద్ర ప్రభుత్వం పౌరసత్వం వదులుకుంటున్న వారిపై సమగ్ర అధ్యయనం చేపట్టి, దేశం కోల్పోతున్న మానవ వనరులు, పెట్టుబడులు, మేధోసంపత్తి, ఆర్థిక అవకాశాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అవినీతిని అరికట్టి, బ్యాంకింగ్ వ్యవస్థలో జవాబుదారీతనం పెంచి, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు రక్షణ కల్పించడంతో పాటు యువతకు దేశంలోనే ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు.
దేశాన్ని విడిచిపోతున్న పౌరులను తప్పుపట్టడం కంటే, వారు దేశంలోనే ఉండాలనే విశ్వాసాన్ని కల్పించలేకపోతున్న పాలకుల విధానాలను సమీక్షించుకోవాలని గుజ్జుల ఈశ్వరయ్య హితవు పలికారు.
