-అక్షయపాత్రకు అనుకూలంగా మెమో జారీ చేయడంపై పోతిన వెంకట మహేష్ ఆగ్రహం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో అన్నప్రసాదం పంపిణీ పేరుతో రూ.30 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని పోతిన వెంకట మహేష్ ఆరోపించారు. శనివారం కొత్తపేటలోని తన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ అంశంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
రూ.2 కోట్ల విలువైన యంత్రాలకు రూ.30 కోట్ల నిర్వహణ వ్యయాన్ని కేటాయించడం, ఎలాంటి టెండర్లు నిర్వహించకుండా అక్షయపాత్ర సంస్థకు అనుకూలంగా మెమో జారీ చేయడం అనుమానాలకు తావిస్తోందని పేర్కొన్నారు. రోజుకు 6 నుంచి 7 వేల మందికి అన్నప్రసాదం పంపిణీ చేసేందుకు రూ.32 కోట్లు ఖర్చు చేయాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు.
ఆలయంలో ఉన్న సుమారు రూ.110 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లను కరిగించే ప్రయత్నాలు జరుగుతున్నాయా అని ఆయన నిలదీశారు. దేవాదాయ శాఖలో అవినీతి, దేవుడి భూముల ఆక్రమణలపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. అన్నప్రసాదం పంపిణీకి సంబంధించిన ఈ నిర్ణయాలను తక్షణమే నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే న్యాయపోరాటం చేయడంతో పాటు భక్తులను కలుపుకొని ఉద్యమం చేపడతామని పోతిన వెంకట మహేష్ హెచ్చరించారు.
