-దేశ సంపద కొద్దిమంది గుప్పిట్లోనే…
-మోడీ హయాంలో అదానీ, అంబానీల సంపదకు రెక్కలు..
-సామాన్యుల జీవితాలకు చిక్కులు…
-సిపిఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
భారతదేశ సంపద కొద్దిమంది గుప్పిట్లో మగ్గుతోందని, పాలకుల విధానాల ఫలితంగా ఒకపక్క అంబానీ, ఆదానీల వంటి కార్పొరేట్ శక్తుల సంపద ఇబ్బడిముబ్బడిగా పెరుగుతోందని, మరోపక్క పేద సామాన్య ప్రజల జీవితాలు మాత్రం పాతాళంలోనే మగ్గిపోతున్నాయని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య వ్యాఖ్యానించారు.
ఈ మేరకు ఈశ్వరయ్య నేడు ఒక ప్రక్కన విడుదల చేశారు. దేశం అభివృద్ధి చెందుతోందని పాలకులు గొప్పలు చెబుతున్నారు. ప్రపంచంలోనే వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటని ప్రచారం చేస్తున్నారు. జీడీపీ పెరుగుదల, విదేశీ పెట్టుబడులు, పారిశ్రామిక ప్రగతి గురించి ఆర్భాటంగా ప్రకటిస్తున్నారు. కానీ ఈ అభివృద్ధి ఫలాలు ఎవరికి దక్కుతున్నాయి? దేశ సంపదను సృష్టిస్తున్న కోట్లాది మంది శ్రమజీవుల జీవితాల్లో ఎందుకు మార్పు రావడం లేదు? సంపద కొద్దిమంది కుబేరుల చేతుల్లోనే ఎందుకు పోగుపడుతోంది? ఈ ప్రశ్నలకు అంతర్జాతీయ ఆర్థిక నివేదికలు వెల్లడిస్తున్న గణాంకాలే సమాధానం చెబుతున్నాయి.
ప్రపంచ అసమానతలపై ఆక్స్ఫామ్ 2026 జనవరిలో విడుదల చేసిన ‘Resisting the Rule of the Rich’ నివేదిక ప్రకారం, 2025లో ప్రపంచ కుబేరుల సంపద 18.3 ట్రిలియన్ డాలర్లకు చేరింది. కుబేరుల సంఖ్య తొలిసారిగా 3,000 దాటింది. వారి సంపద పెరుగుదల వేగం గత ఐదేళ్ల సగటు కంటే మూడు రెట్లు అధికంగా ఉంది. మరోవైపు ప్రపంచ జనాభాలో ప్రతి నలుగురిలో ఒకరు ఆకలిని ఎదుర్కొంటున్నారు. సంపదతోపాటు రాజకీయ అధికారాన్ని కూడా కొద్దిమంది కుబేరులు తమ గుప్పిట్లోకి తీసుకుంటున్నారని ఆక్స్ఫామ్ హెచ్చరించింది.
భారతదేశ పరిస్థితి మరింత ఆందోళనకరం. వరల్డ్ ఇనీక్వాలిటీ రిపోర్ట్–2026 వెల్లడించిన 2024 గణాంకాల ప్రకారం, దేశంలోని అత్యంత సంపన్నులైన పై 10 శాతం మంది చేతుల్లో 65 శాతం సంపద కేంద్రీకృతమైంది. అందులోనే పై ఒక శాతం మంది చేతుల్లో 40.1 శాతం సంపద ఉంది. మరోవైపు జనాభాలోని దిగువ 50 శాతం మంది చేతుల్లో ఉన్న సంపద కేవలం 6.4 శాతం మాత్రమే. జాతీయ ఆదాయంలో పై 10 శాతం వాటా 57.7 శాతం కాగా, దిగువ 50 శాతం ప్రజలకు దక్కుతున్నది కేవలం 15 శాతం మాత్రమే. అంటే దేశ సంపదలో అత్యధిక భాగం కొద్దిమంది చేతుల్లోనే బందీ అయింది.
సంపద సృష్టించేది ఎవరు? రైతులు, వ్యవసాయ కార్మికులు, పారిశ్రామిక కార్మికులు, నిర్మాణ కార్మికులు, ఉద్యోగులు, చిరు వ్యాపారులు, మహిళలు, అసంఘటిత రంగ శ్రమజీవులు. వీరి చెమట చుక్కలతోనే వ్యవసాయం, పరిశ్రమలు, రవాణా, నిర్మాణ రంగాలు నడుస్తున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థకు పునాదిగా నిలుస్తున్న వీరికి మాత్రం న్యాయమైన వేతనాలు, ఉద్యోగ భద్రత, సామాజిక భద్రత దక్కడం లేదు. ధరల పెరుగుదల, నిరుద్యోగం, అప్పుల భారం, విద్యా వైద్య ఖర్చులు సామాన్యుల జీవితాలను కుంగదీస్తున్నాయి. శ్రమ ఒకరిది.. సంపదపై అధికారం మరొకరిది.. ఇదే నేటి ఆర్థిక వ్యవస్థలోని ప్రధాన వైరుధ్యం.
సెంటర్ ఫర్ ఫైనాన్షియల్ అకౌంటబిలిటీ విడుదల చేసిన ‘Wealth Tracker India 2026’ అధ్యయనం ప్రకారం, 2019–2025 మధ్య దేశంలోని ఐదుగురు అత్యంత సంపన్నుల కుటుంబాల సంపద సుమారు 400 శాతం పెరిగింది. ఇదే కాలంలో గౌతమ్ అదానీ సంపద 625 శాతం, ముకేశ్ అంబానీ సంపద 153 శాతం పెరిగినట్లు ఆ అధ్యయనం అంచనా వేసింది. దేశ సంపదలో ఇంతటి కేంద్రీకరణ ఎందుకు జరుగుతోంది? ప్రభుత్వ విధానాలు, ప్రజా ఆస్తుల నిర్వహణ, మార్కెట్ వ్యవస్థలో కార్పొరేట్ ఆధిపత్యం ఎంతవరకు పెరిగింది? అన్నదే అసలు ప్రశ్న.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక విధానాలు ఈ అసమానతలను తగ్గిస్తున్నాయా? లేక మరింత పెంచుతున్నాయా? 2019లో దేశీయ కంపెనీలకు నిర్దిష్ట షరతులతో కార్పొరేట్ పన్ను రేటును 30 శాతం నుంచి 22 శాతానికి తగ్గించే అవకాశం కల్పించారు. ప్రభుత్వ ఆస్తుల నగదీకరణకు 2021లో రూ.6 లక్షల కోట్ల లక్ష్యాన్ని ప్రకటించగా, 2026లో రెండో దశ కింద రూ.16.72 లక్షల కోట్ల నగదీకరణ సామర్థ్యాన్ని ప్రకటించారు. పెట్టుబడులు, అభివృద్ధి పేరుతో ప్రభుత్వ ఆస్తుల నిర్వహణలో ప్రైవేటు రంగానికి విస్తృత అవకాశాలు కల్పిస్తున్నారు. కానీ ఈ విధానాల వల్ల సామాన్య ప్రజలకు కలుగుతున్న ప్రయోజనం ఎంత? కార్మికులకు ఎన్ని శాశ్వత ఉద్యోగాలు వచ్చాయి? రైతులకు, పేదలకు, మధ్యతరగతికి ఎంత ఉపశమనం లభించింది?
ప్రభుత్వరంగ బ్యాంకులు 2020–21 నుంచి 2024–25 వరకు రూ.5.80 లక్షల కోట్లకు పైగా రుణాలను రైట్ఆఫ్ చేశాయి. రైట్ఆఫ్ అంటే రుణమాఫీ కాదు. రుణగ్రహీత బాధ్యత కూడా రద్దయిపోదు. అయినప్పటికీ ఈ రుణాల్లో ఎంత మొత్తం తిరిగి వసూలైంది? పెద్ద రుణగ్రహీతల విషయంలో బ్యాంకులు, ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం ఏమిటి? సామాన్య రైతు అప్పు చెల్లించలేకపోతే అతని ఆస్తులపై ఒత్తిడి తెచ్చే వ్యవస్థ, వేల కోట్ల రుణాలు తీసుకున్న పెద్ద సంస్థల విషయంలో ఎంత కఠినంగా వ్యవహరిస్తోంది?
దేశ సంపద పెరుగుతున్నప్పుడు పేదరికం, నిరుద్యోగం, ఆకలి, ఆర్థిక అసమానతలు ఎందుకు కొనసాగుతున్నాయి? కార్పొరేట్లకు పన్ను రాయితీలు, ప్రజా ఆస్తుల నిర్వహణ హక్కులు కల్పించే పాలకులు శ్రమజీవులకు న్యాయమైన వాటా కల్పించడంలో ఎందుకు విఫలమవుతున్నారు? ఈ ప్రశ్నలకు కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి.
దేశ సంపద కొద్దిమంది కుబేరుల సొత్తు కాదు. కోట్లాది మంది ప్రజల శ్రమతో నిర్మితమైన జాతీయ సంపద. సంపద సృష్టించే శ్రమజీవులకు దానిపై న్యాయమైన వాటా దక్కాలి. సంపన్నులపై ప్రగతిశీల పన్నులు విధించాలి. ప్రభుత్వరంగాన్ని బలోపేతం చేయాలి. విద్య, వైద్యం, ఉపాధి, వ్యవసాయం, సామాజిక భద్రతకు ప్రభుత్వ వ్యయం పెంచాలి. కార్పొరేట్ గుత్తాధిపత్యాన్ని అరికట్టాలి.
అభివృద్ధి అంటే కుబేరుల సంపద పెరగడం కాదు.. కోట్లాది మంది ప్రజల జీవితాలు మెరుగుపడటం. దేశ సంపద కొద్దిమంది చేతిలోనే కాకుండా ప్రజలందరికీ చెందేలా పాలకుల విధానాలు ఉండాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ పరిస్థితుల్లో శ్రమజీవుల హక్కుల కోసం, ఆర్థిక సమానత్వం కోసం ప్రజలంతా ఐక్య ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిస్తున్నాం.
