-డిప్యూటీ మేయర్‌గా కొట్టే అంకా వెంకట్రావు ఎన్నిక..
-మచిలీపట్నం నగరాన్ని స్వచ్ఛ మచిలీపట్నంగా తీర్చిదిద్దేందుకు నూతన పాలకవర్గం సమష్టిగా కృషి చేయాలి
-జిల్లా కలెక్టర్ డీకే బాలాజి
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త:
కృష్ణా జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా సోమవారం మచిలీపట్నం నగరపాలక సంస్థ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం, డిప్యూటీ మేయర్ ఎన్నిక కార్యక్రమం నగరంలోని రేవతి సెంటర్ సమీపంలో ఆర్కే గుడ్ టైమ్స్ వెనుక ఉన్న నూతన మున్సిపల్ కౌన్సిల్ సమావేశ మందిరంలో నిర్వహించారు. కార్యక్రమానికి ప్రిసైడింగ్ అధికారిగా వ్యవహరించిన జిల్లా కలెక్టర్ డీకే బాలాజి, ఇటీవలి మున్సిపల్ ఎన్నికల్లో ఎన్నికైన మేయర్, కార్పొరేటర్లతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం డిప్యూటీ మేయర్ ఎన్నిక ప్రక్రియ నిర్వహించి, నూతన పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలియజేశారు.
తొలుత నగర ప్రథమ పౌరురాలిగా ఎన్నికైన మేయర్ అబ్దుల్ అబీద ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం తెలుగు అక్షరమాల క్రమంలో కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం నిర్వహించారు. 47వ డివిజన్ కార్పొరేటర్ అన్నం శ్రీ ఆనంద్‌తో ప్రారంభమైన ప్రమాణ స్వీకార కార్యక్రమం చివరిగా 16వ డివిజన్ కార్పొరేటర్ హసీం బేగ్‌తో ముగిసింది. మొత్తం 60 మంది కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో టీడీపీ నుంచి 34 మంది, జనసేన నుంచి 13 మంది, వైఎస్సార్సీపీ నుంచి 9 మంది, బీజేపీ నుంచి ఒకరు, స్వతంత్రులు ముగ్గురు ఉన్నారు.
అనంతరం డిప్యూటీ మేయర్ ఎన్నిక ప్రక్రియ చేపట్టగా, 10వ డివిజన్ కార్పొరేటర్ కొట్టే అంకా వెంకట్రావు పేరును 18వ డివిజన్ కార్పొరేటర్ రామానుజవరపు సమతా కీర్తి ప్రతిపాదించారు. 58వ డివిజన్ కార్పొరేటర్ వడ్డీ చిరంజీవి కుమార్ బలపరిచారు. మరో అభ్యర్థి ఎవరూ ప్రతిపాదించకపోవడంతో కొట్టే అంకా వెంకట్రావు ఏకగ్రీవంగా డిప్యూటీ మేయర్‌గా ఎన్నికైనట్లు జిల్లా కలెక్టర్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయనకు అభినందనలు తెలియజేశారు.
అనంతరం జిల్లా కలెక్టర్ డీకే బాలాజి మాట్లాడుతూ, మచిలీపట్నం నగరపాలక సంస్థకు మేయర్ అబ్దుల్ అబీద నాయకత్వంలో నూతన పాలకవర్గం ఏర్పాటైందని, నగర అభివృద్ధికి అందరూ సమష్టిగా కృషి చేయాలని ఆకాంక్షించారు. మచిలీపట్నాన్ని స్వచ్ఛమైన నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.
కౌన్సిల్ సమావేశ మందిరంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌కు బదులుగా పునర్వినియోగ వస్తువులను వినియోగించడం ద్వారా పర్యావరణహిత కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లకు బదులుగా స్టీల్ వాటర్ బాటిళ్లు, పునర్వినియోగ గ్లాసులు, స్నాక్స్ కోసం స్టీల్ ప్లేట్లను వినియోగించామని వివరించారు. చెత్త ఉత్పత్తిని తగ్గించడం ద్వారా నగరపాలక సంస్థపై చెత్త నిర్వహణ భారం తగ్గుతుందని పేర్కొన్నారు.
ఇదే స్ఫూర్తితో కార్పొరేటర్లు తమ తమ వార్డుల్లో ప్రజలకు పునర్వినియోగ వస్తువుల వినియోగంపై అవగాహన కల్పించాలని, సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను పూర్తిగా నివారించేలా ప్రజలను ప్రోత్సహించాలని కోరారు. ప్రజల భాగస్వామ్యంతో మచిలీపట్నాన్ని స్వచ్ఛమైన, పర్యావరణహిత నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా సభ్యుల ప్రమాణ స్వీకారం, ఎన్నిక ప్రక్రియను కృష్ణా జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకుడు, ఐఏఎస్ అధికారి వి. అభిషేక్ పర్యవేక్షించారు.
కార్యక్రమంలో మచిలీపట్నం నగర మున్సిపల్ కమిషనర్ బాపిరాజు, జెడ్పీ సీఈవో ఎం శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.
