-అధికారులకు నగర కమిషనర్ కె. మయూర్ అశోక్ ఆదేశం
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త:
నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయడంతో పాటు పారిశుధ్య నిర్వహణ, తాగునీటి సరఫరాను మరింత పటిష్టం చేయాలని నగర కమిషనర్ కె. మయూర్ అశోక్ ఇంజినీరింగ్, ప్రజారోగ్య విభాగాల అధికారులను ఆదేశించారు.
మంగళవారం నగరంలోని జియావుద్దీన్ నగర్, కపర్ది నగర్, ఆర్టీసీ కాలనీ, ఇజ్రాయిల్ పేట తదితర ప్రాంతాల్లో కమిషనర్ విస్తృతంగా పర్యటించారు. ఆయా ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులు, పారిశుధ్య పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించి సంబంధిత అధికారులకు పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. ప్రతి ఏఈ, సచివాలయ కార్యదర్శి తమ పరిధిలో తాగునీటి సరఫరాపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. ఎప్పటికప్పుడు నీటి నమూనాలను సేకరించి, వాటి పరీక్షా నివేదికలను ఆన్లైన్లో నమోదు చేయడంతో పాటు రిజిస్టర్లోనూ తప్పనిసరిగా పొందుపరచాలని సూచించారు. తాగునీటి పైప్లైన్లకు లీకేజీలు ఏర్పడితే ఏమాత్రం ఆలస్యం చేయకుండా తక్షణమే మరమ్మతులు చేపట్టాలన్నారు.
ఆర్టీసీ కాలనీలోని స్మృతి వనం పార్కులో అవసరమైన అభివృద్ధి పనులు చేపట్టాలని, మణిపురం వంతెన కింద ఉన్న ఓపెన్ జిమ్, చిన్నారుల ఆట పరికరాలకు మరమ్మతులు చేయాలని డీఈఈని ఆదేశించారు.
నగరంలో నూతన సీసీ రోడ్లు, డ్రైన్ల నిర్మాణ పనులను వేగవంతం చేయడంతో పాటు నాణ్యతా ప్రమాణాల విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకూడదని స్పష్టం చేశారు. ప్రతి పనికి థర్డ్ పార్టీ క్వాలిటీ కంట్రోల్ ఏజెన్సీ నుంచి తప్పనిసరిగా నాణ్యతా ధ్రువీకరణ పత్రం పొందాలన్నారు. నిబంధనల ప్రకారం నాణ్యతా ప్రమాణాలు పాటించకపోతే సంబంధిత కాంట్రాక్టర్లతో పాటు బాధ్యులైన అధికారులపైనా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
చెత్త సేకరణలో వంద శాతం లక్ష్యం సాధించాలి
నగరంలో ఈ-ఆటోల ద్వారా వంద శాతం ఇంటింటి చెత్త సేకరణ జరగాలని ప్రజారోగ్య విభాగం అధికారులను కమిషనర్ ఆదేశించారు. ప్రతి ఆటో నిర్దేశించిన రూట్ మ్యాప్ ప్రకారమే పర్యటిస్తూ చెత్తను సక్రమంగా సేకరించాలన్నారు. నగరంలో ఎక్కడా చెత్త పేరుకుపోయే ప్రాంతాలు (గార్బేజ్ వల్నరబుల్ పాయింట్స్) కనిపించకూడదని, రోడ్లపై చెత్త వేయకుండా నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.
వాణిజ్య సంస్థలు, వీధి వ్యాపారులు ఎవరైనా రోడ్లు, డ్రైన్లలో వ్యర్థాలు వేస్తే భారీగా జరిమానాలు విధించాలని స్పష్టం చేశారు. ఖాళీ స్థలాల్లో పిచ్చిమొక్కలు, చెత్తాచెదారం పేరుకుపోకుండా స్థల యజమానులకు నోటీసులు జారీ చేయాలన్నారు. నోటీసులకు స్పందించకపోతే జరిమానాలు విధించి, పారిశుధ్య పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
ఈ పర్యటనలో ఎస్ఈ జి. వెంకటేశ్వరరావు, ఈఈ డి. సుందర్రామిరెడ్డి, డీఈఈ హనీఫ్, ఎస్ఎస్ సాంబయ్య, కార్పొరేటర్ కె. పిచ్చిరెడ్డి, వివిధ సచివాలయాల కార్యదర్శులు పాల్గొన్నారు.
