– ఘనంగా విజయవాడ మేయర్ ప్రమాణ స్వీకారం
– 85 మంది వార్డు సభ్యులతోనూ ప్రమాణ స్వీకారం చేయించిన ప్రిసైడింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
– డిప్యూటీ మేయర్గా ఎన్నికైన 12వ వార్డు సభ్యులు కాంతిశ్రీ చెన్నుపాటి (టీడీపీ)
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
విజయవాడ నగరపాలక సంస్థ నూతన మేయర్, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవంతో పాటు డిప్యూటీ మేయర్ ఎన్నిక సోమవారం విజయవాడలోని డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కళావేదికలో ఘనంగా జరిగింది. నియమనిబంధనల మేరకు ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశానికి ప్రిసైడింగ్ అధికారిగా వ్యవహరించిన జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ జి.లక్ష్మీశ.. నూతనంగా ఎన్నికైన మేయర్ వంగవీటి రాధాకృష్ణతో పాటు 85 మంది వార్డు సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. 32వ వార్డు నుంచి ఎన్నికైన శైలజ సురభి (టీడీపీ) మినహా మిగిలిన అందరు అక్షర క్రమంలో వార్డు సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో నగర ప్రజలకు మెరుగైన పాలన అందించడం, నగర అభివృద్ధికి కృషి చేయడం, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వడం వంటి అంశాలతో ప్రజాప్రతినిధుల బాధ్యతలు ప్రారంభమయ్యాయి.
*మేయర్, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం అనంతరం ఆంధ్రప్రదేశ్ మునిసిపల్ కార్పొరేషన్స్ కండక్ట్ ఆఫ్ ఎలక్షన్ ఆఫ్ డిప్యూటీ మేయర్ రూల్స్ – 2026 మరియు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఉత్వర్వుల మేరకు డిప్యూటీ మేయర్ ఎన్నిక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మేయర్, ఎక్స్ అఫీషియో సభ్యులు, కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా చెన్నుపాటి కాంతిశ్రీ (12వ వార్డు, తెదేపా) పేరును 48వ వార్డు సభ్యులు ఉమ్మడి వెంకటేశ్వరరావు ప్రతిపాదించగా, 4వ వార్డు సభ్యులు నందిపాటి దేవానంద్ కుమార్ బలపరిచారు. అనంతరం చెన్నుపాటి కాంతిశ్రీ డిప్యూటీ మేయర్గా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రిసైడింగ్ అధికారి డా. జి.లక్ష్మీశ ప్రకటించడం జరిగింది. కార్యక్రమంలో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), శాసన మండలి సభ్యులు వర్ల రామయ్య, ఎం.డి.రుహుల్లా, ఏపీ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్, విజయవాడ నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ ఎ.రవీంద్రరావు, మేయర్, వార్డు సభ్యుల కుటుంబ సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. నూతన మేయర్, డిప్యూటీ మేయర్, వార్డు సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
