అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా మంగళగిరి–తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి నారా భువనేశ్వరి, మంత్రి నారా లోకేష్, ఆయన సతీమణి నారా బ్రాహ్మణి గురువారం తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఉండవల్లిలోని మండల పరిషత్ అప్పర్ ప్రైమరీ స్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో చంద్రబాబు, భువనేశ్వరి ఓటు వేశారు. అదే కేంద్రంలో మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
అనంతరం మీడియాతో మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బాధ్యత కలిగిన పౌరులందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజలు ఓటు వేసినప్పుడే ప్రజాస్వామ్యం మరింత బలోపేతమవుతుందని, ఓటు హక్కు వినియోగించుకున్నప్పుడే ప్రభుత్వాలను ప్రశ్నించే హక్కు ఉంటుందని పేర్కొన్నారు.
ఎన్నికల్లో డబ్బు ప్రభావం లేకుండా ఓటర్లు స్వేచ్ఛగా తమ నిర్ణయాన్ని వెల్లడించే పరిస్థితులు ఉండాలని, ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలని అన్నారు.
రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం దేశానికి దిశానిర్దేశం చేసిందని, పేద, ధనిక అనే తేడా లేకుండా ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించి ప్రజాస్వామ్యంలో భాగస్వామిని చేసిందని పేర్కొన్నారు. భారత ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటూ దేశాభివృద్ధికి సమర్థవంతమైన నాయకత్వానికి ప్రజలు తమ ఓటు ద్వారా మద్దతు తెలియజేయాలని కోరారు.
ఓటు హక్కు వినియోగించుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ దంపతులు
