-ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలని ఇంటింటి ప్రచారం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 59వ డివిజన్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి పోలగాని సాయిమనోహర్ డివిజన్లో స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ స్థానిక ప్రజలను కలుసుకున్న ఆయన, తనను కార్పొరేటర్‌గా గెలిపిస్తే డ్రైనేజీ సమస్యల పరిష్కారం, మెరుగైన తాగునీటి సరఫరా, వీధి విద్యుత్ దీపాల ఏర్పాటు వంటి అంశాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తానని పేర్కొన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని, డివిజన్ అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తానని వెల్లడించారు. ఈ సందర్భంగా ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి తనను కార్పొరేటర్‌గా గెలిపించాలని పోలగాని సాయిమనోహర్ ఓటర్లను కోరారు. అలాగే విజయవాడ మేయర్ అభ్యర్థి రాయన భాగ్యలక్ష్మికి మద్దతు తెలిపి ఆమెను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
నగర అభివృద్ధిపై దృష్టి సారించాలి: రాయన భాగ్యలక్ష్మి
మేయర్ అభ్యర్థి రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ, గత మూడేళ్ల పాలనలో విజయవాడ నగరంలో సంక్షేమం, అభివృద్ధి ఆశించిన స్థాయిలో జరగలేదని విమర్శించారు. నగరంలోని డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని, స్థానిక సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం కనిపిస్తోందని ఆరోపించారు. బుడమేరు వరదల సమయంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, బాధితులకు తగిన సహాయం అందలేదని పేర్కొన్నారు. నగరంలోని సమస్యల పరిష్కారానికి పాలకులు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.
ప్రజా సమస్యలపై వైఎస్సార్సీపీ పోరాటం: మల్లాది విష్ణు
మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ, వైఎస్సార్సీపీ ప్రజా సమస్యలపై బలమైన ప్రతిపక్షంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోందని తెలిపారు. విద్యుత్ ఛార్జీల తగ్గింపు, రైతులకు గిట్టుబాటు ధర, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిరోధం, ఫీజు రీయింబర్స్మెంట్ వంటి అంశాలపై ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నామని పేర్కొన్నారు. బియ్యం, వంటనూనె, పంచదార, పాలు, గ్యాస్, పెట్రోల్ ధరల పెరుగుదలతో సామాన్య ప్రజలపై ఆర్థిక భారం పెరిగిందని విమర్శించారు. విద్యుత్ ఛార్జీల పెరుగుదలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్న వృద్ధులు, పేదలు, భర్తను కోల్పోయిన మహిళల సమస్యలను ప్రస్తావిస్తూ, అర్హులకు పెన్షన్లు సకాలంలో అందించాలని కోరారు.
విజయవాడ నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం మేయర్ అభ్యర్థి రాయన భాగ్యలక్ష్మితో పాటు వైఎస్సార్సీపీ కార్పొరేటర్ అభ్యర్థులకు ప్రజలు మద్దతు తెలపాలని మల్లాది విష్ణు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ డివిజన్ అధ్యక్షులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
