78వ డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తా… : కాంగ్రెస్ అభ్యర్థి వేముల కనకదుర్గ

-షాదీఖానా ప్రాంతంలో ఇంటింటి ప్రచారం.. హస్తం గుర్తుపై ఓటు వేయాలని అభ్యర్థన

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సెంట్రల్ నియోజకవర్గం 78వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వేముల కనకదుర్గ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. డివిజన్ పరిధిలోని షాదీఖానా ప్రాంతంలో ఇంటింటికీ తిరుగుతూ స్థానిక ఓటర్లను కలిసి తనకు మద్దతు ఇవ్వాలని అభ్యర్థించారు.
రానున్న ఎన్నికల్లో తనకు అమూల్యమైన ఓటును హస్తం గుర్తుపై వేసి గెలిపించాలని ఆమె ఓటర్లను కోరారు. ప్రజలు తనకు కార్పొరేటర్‌గా సేవ చేసే అవకాశం కల్పిస్తే డివిజన్‌లో నెలకొన్న ప్రధాన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ముఖ్యంగా డివిజన్‌లో దోమల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టడంతో పాటు, సైడ్ డ్రెయినేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే డివిజన్‌లోని మహిళలకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను ప్రోత్సహిస్తానని పేర్కొన్నారు.
ఈ ప్రచార కార్యక్రమంలో ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర కోఆర్డినేటర్ వేముల శ్రీనివాస్, ఎన్టీఆర్ జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు బత్తుల అంకమ్మరాజు, యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి నాగెళ్ల కిషోర్, వీకేకేసీ రాష్ట్ర కార్యదర్శి మామిడాల రమణ, సీనియర్ కాంగ్రెస్ నాయకులు వేముల దుర్గారావు, వేముల సుబ్రహ్మణ్యం, శేఖర్, సుభాష్ తదితరులు పాల్గొన్నారు.