Breaking News

రాష్ట్ర వ్యాప్తంగా 28.30 లక్షల ఇళ్ళను నిర్మిస్తున్న సీఎం జగన్మోహనరెడ్డి : మంత్రి కొడాలి నాని

గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రవ్యాప్తంగా 28.30 లక్షల ఇళ్ళను సీఎం జగన్మోహనరెడ్డి నిర్మిస్తున్నారని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. గురువారం గుడివాడ రూరల్ మండలం లింగవరంలో పలువురు గ్రామస్థులు మంత్రి కొడాలి నానిని కలిశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీటీసీ సభ్యుడు కళ్ళేపల్లి శంకరరావు మాట్లాడుతూ ఇళ్ళపట్టాల ఎంపిక ప్రక్రియలో 18 మందిని వివిధ కారణాలతో అనర్హులుగా గుర్తించారని చెప్పారు. వీరంతా ఇళ్ళు లేని నిరుపేదలేనని చెప్పారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా సాంకేతిక సమస్యలను పరిష్కరించుకున్నారని తెలిపారు. అర్హత ఉన్న 18 మందికి కూడా ఇళ్ళపట్టాలను ఇప్పించాలని కోరారు. దీనిపై మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ గత ఏడాది డిసెంబర్ 25 వ తేదీ నుండి ఇళ్ళపట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. లింగవరం గ్రామంలో అర్హులైన 119 మందికి గుడివాడ రూరల్ మండలం మల్లాయిపాలెం లేఅవుట్లో ఇళ్ళపట్టాలను పంపిణీ చేశామన్నారు. ఇంకా ఇళ్ళు లేని 18 మంది నిరుపేదలు కూడా గ్రామ సచివాలయం ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అర్హతలను పరిశీలించి దరఖాస్తు చేసుకున్న 90 రోజుల్లో ఇంటి పట్టాను అందజేస్తామని చెప్పారు. ఇదిలా ఉండగా పేదలందరికీ ఇళ్ళనిర్మాణ పథకం కింద చురుగ్గా ఇళ్ళనిర్మాణ పనులు జరుగుతున్నాయన్నారు. దీనిలో భాగంగా 17,005 జగనన్న కాలనీల నిర్మాణం జరుగుతోందన్నారు. గతం కంటే విశాలమైన ఇళ్ళు రానున్నాయని, వీటిని కుటుంబ కనీస అవసరాలకనుగుణంగా డిజైన్ చేయడం జరిగిందన్నారు. జగనన్న కాలనీల్లో మెరుగైన వసతులను కల్పించేందుకు ప్రభుత్వం రూ.34 వేల 109 కోట్లను కేటాయించిందన్నారు. దేశ చరిత్రలోనే తొలిసారిగా రాష్ట్రంలో మహిళల పేరిట 30. 70 లక్షల ఇళ్ళపట్టాలను రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడం జరిగిందని మంత్రి కొడాలి నాని చెప్పారు.

Check Also

సేవా సంస్థలు ఐక్యంగా కృషి చేయాలి

-వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని సేవా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *