-ప్రభుత్వ గుర్తింపు అనుమతులు పొందిఉన్నపాఠశాలు మాత్రమే ప్రారంభించాలి…
-ఉప విద్యాశాఖాధికారిణి కమల కుమారి
గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ నెల 16 వ తేదీ నుంచి పాఠశాలలు పునః ప్రారంభం అవుతున్నందున ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండేవిధంగా అన్ని పాఠశాలలను పరిశుభ్రంగా ఉంచాలని ఉప విద్యాశాఖాధికారిణి కమల కుమారి అన్నారు. గురువారం స్థానిక మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో మండలంలోని ప్రైవేట్ పాఠశాలల నిర్వాహకులతో ప్రత్యేక సమావేశాన్ని ఉప విద్యాధికారి కమల కుమారి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భం గా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ గుర్తింపు అనుమతులు పొంది ఉన్నపాఠశాలు మాత్రమే ప్రారంభించాలన్నారు. గుర్తింపులేని పాఠశాలల యాజమాన్యం గుర్తింపు కొరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రతి పాఠశాలలో విద్యార్థుల నుండి వసూలు చేస్తున్న ఫీజు వివరాలు, తరగతుల వారీగా డిస్ప్లే బోర్డులో ప్రదర్శించాలన్నారు. మారిన ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగానే పాఠశాలల్లో తరగతులు నిర్వహించాలి. ప్రభుత్వ, ప్రవేటు పాఠశాలలు ఈ నెల 16 తేదీ నుంచే ప్రారంభమవుతున్న దృష్ట్యా పాఠశాల ప్రధానోపాధ్యాయులు, నిర్వాహుకులు పాఠశాలలను ఆహ్లాదకరమైన వాతావరణంలో శుభ్రంగా ఉంచాలని కోరారు. అనంతరం గుడివాడ డివిజన్ పరిధిలోని గుడివాడ, పామర్రు, పెదపారుపూడి, నందివాడ మండలాల్లో గల ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులుకు 9, 10 తరగతి విద్యార్థుల యూనిఫాం పంపిణీ చేశారు. జగనన్న విద్యాకానుక లో భాగంగా డివిజన్ పరిధిలో గల పాఠశాలలకు బ్యాగ్స్, షూలు, టైల్ లు, 9,10 తరగతి విద్యార్థులకు యూనిఫాంలు అందించడం జరింగిందన్నారు. పాఠశాలలు ప్రారంభ సమయంలో విద్యార్థులకు జగనన్న కిట్స్ అందజేస్తామని తెలిపారు. సమావేశంలో మండల విద్యాశాఖ అధికారి యం.రామారావు, మండల పరిధిలోని పలు పాఠశాలల నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.