Breaking News

వైయస్ఆర్ చేయూత, వైయస్ఆర్ పెన్షన్ కానుక, జగనన్న పల్లెవెలుగు, గ్రామపంచాయతీల్లో లేఅవుట్ల పై సమీక్షా సమావేశం…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
వైయస్ఆర్ చేయూత పథకం ద్వారా మహిళల ఆర్థిక స్వావలంభనకు ప్రాంతాల వారీగా స్థానికంగా ఉన్న మార్కెటింగ్ అంశాలను అధ్యయనం చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. తాడేపల్లిలోని పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయంలో వైయస్ఆర్ చేయూత, వైయస్ఆర్ పెన్షన్ కానుక, జగనన్న పల్లెవెలుగు, గ్రామపంచాయతీల్లో లేఅవుట్ల పై అధికారుతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ 45 నుంచి 60 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న మహిళలను ఆర్థికంగా కుటుంబానికి అండగా నిలబెట్టాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి  వైయస్ జగన్ వైయస్ఆర్ చేయూత పథకాన్ని ప్రారంభించారని మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఇప్పటి వరకు రెండు విడతల్లో లక్షలాధి మంది మహిళలకు ఆర్థిక సాయాన్ని అందించడంతో పాటు, వారిని వ్యాపారాలు, స్వయం ఉపాధి దిశగా నడిపించేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నామని అన్నారు. దీనిలో భాగంగా ఇప్పటికే రిలయన్స్, ఏజియో, మహేంద్ర అండ్ ఖేథీ వంటి ప్రముఖ సంస్థలు మహిళల వ్యాపార కార్యకలాపాలకు మార్కెటింగ్, శిక్షణ అంశాలను అందించేందుకు ముందుకు వచ్చాయని అన్నారు. రాష్ట్రాంలోని అన్ని జిల్లాల్లో స్థానికంగా ఉన్న మార్కెటింగ్ అంశాలను సెర్ప్ అధికారులు పరిశీలించాలని సూచించారు.
గత ఏడాది అక్టోబర్ 12వ తేదీన వైయస్ఆర్ చేయూత మొదటి విడత కార్యక్రమాన్ని అమల చేశామని, దీనిలో మొత్తం 24,00,111 మంది లబ్ధిదారులకు మొత్తం రూ.4500.20 కోట్ల రూపాయల మేరకు లబ్ధి జరిగిందని అన్నారు. మొత్తం 78 వేల రిటైల్ షాప్లను ఏర్పాటు చేయడం జరిగిందని, అలాగే 1,19,000 పశువులు, 70,955 గొర్రెలు మేకలను లబ్ధిదారులు కొనుగోలు చేశారని అన్నారు. రెండో ఏడాది 23.44 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు దాదాపు రూ.4,400 కోట్ల అర్ధిక సాయం అందించామని తెలిపారు. మంచి ఆశయంతో సీఎం ప్రారంభించిన ఈ పథకాన్ని అమలు చేయడం, పర్యవేక్షించడంలో అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని కోరారు.

అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పెన్షన్లు అందాలి…
పెన్షన్ల విషయంలో అర్హత ఉన్న ప్రతిఒక్కరికీ అందేలా చర్యలు తీసుకోవాలని మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సూచించారు. అలాగే హెల్త్ పెన్షన్లు పొందున్న వారిలో కొందరు అనర్హులు కూడా ఉన్నారనే ఆరోపణల నేపథ్యంలో పూర్తిస్థాయిలో విచారణ జరపాలని, వైద్యాధికారుల నుంచి నివేదికలను తెప్పించుకోవాలని అన్నారు. వితంతు, వంటరి మహిళ పెన్షన్ల జారీలో ఎక్కడా పొరపాట్లు లేకుండా, అర్హతను గుర్తించాలని అన్నారు.

పంచాయతీలకే వీధిదీపాల నిర్వహణ బాధ్యతలపై పరిశీలన…
గ్రామ పంచాయతీల్లో ఎల్ఇడి వీధిదీపాల నిర్వహణ బాధ్యతలు నిర్వహిస్తున్న కాంట్రాక్టింగ్ ఏజెన్సీ పనితీరు పట్ల మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వీధిదీపాల కోసం చెల్లిస్తున్న విద్యుత్ బిల్లును తగ్గించాలనే లక్ష్యంతో జగనన్న పల్లెవెలుగు కింద రాష్ట్రం అంతా ఎల్ఇడి బల్బ్ లను ఏర్పాటు చేశామని, అయితే వీటి నిర్వహణలో కాంట్రాక్టింగ్ ఏజెన్సీ విఫలమయ్యిందని అన్నారు. పట్టపగలు కూడా పల్లెల్లో వీధిదీపాలు వెలుగుతున్నాయనే అంశంపై పలు ఫిర్యాదులు ఉన్నాయని అన్నారు. వీటిని నియంత్రించే సాంకేతిక పరిజ్ఞానం విషయంలో కాంట్రాక్టింగ్ ఏజెన్సీ సత్వరం చర్యలు తీసుకోకపోవడం వల్ల ఎల్ఇడి వల్ల ఆదాచేసినది కూడా వృధాగా విద్యుత్ బిల్లులుగా చెల్లించాల్సి వస్తోందని అన్నారు. వీధిదీపాలను నియంత్రించే బాక్స్లు తరచూ మరమ్మతులకు గురవుతున్నాయని, వాటికి వెంటనే రిపేర్లు చేయడంలో ఎందుకు అలసత్వం చూపుతున్నారని అధికారులను నిలదీశారు. ఇందుకు కారణమైన కాంట్రాక్ట్ ఏజెన్సీకి నోటీసులు జారీ చేయాలని, ప్రభుత్వ ధనంను వృధా చేయడాన్ని సీరియస్గా తీసుకోవాలని అన్నారు. ఇకపై పంచాయతీలకే వీధిదీపాల నిర్వహణను అప్పగించే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. గ్రామసచివాలయాల సహకారం తీసుకోవాలని, ఎనర్జీ అసిస్టెంట్లను వీధిదీపాల నిర్వహణలో భాగస్వాములను చేయాలని కోరారు. నిర్ణీత సమయాలలోనే వీధిదీపాలు వెలిగేలా చూడాలని అన్నారు.

పంచాయతీల్లో అక్రమ లేఅవుట్స్ పై కఠిన చర్యలు…
రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీల్లో అక్రమ లేఅవుట్లను గుర్తించి, వాటిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. అనధికారిక లేఅవుట్ల పై చర్యల కోసం ఇటీవల విజిలెన్స్ బృందాలతో రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు చేయించామని తెలిపారు. దీనిలో మొత్తం 10,169 లేఅవుట్లు అక్రమగా ఉన్నట్లు గుర్తించామని అన్నారు. ఈ లేఅవుట్ల వల్ల ప్రభుత్వ ఆదాయానికి గండిపడిందని అన్నారు. వెంటనే వీటికి నోటీసులు జారీ చేయాలని, ఇక్కడ ఎటువంటి నిర్మాణాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అక్రమ లేఅవుట్లలో స్థలాలను కొనుగోలు చేసి, ప్రజలు నష్టపోకుండా రిజిస్ట్రేషన్ శాఖకు కూడా ఈ లేఅవుట్ల సమాచారంను పంపి, రిజిస్ట్రేషన్లు జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలోని పంచాయతీల్లో కేవలం 6048 అప్రూవుడ్ లేఅవుట్స్ మాత్రమే ఉన్నాయని, అనధికారిక నిర్మాణాలపై కూడా భారీగా జరిమానాలు విధించాలని సూచించారు.
రాష్ట్రంలో మొత్తం 13,371 పంచాయతీల్లో 6,815 పంచాయతీలు అర్భన్ డెవలప్ మెంట్ అథారిటీ (యుడిఎ) పరిధిలో ఉన్నాయని, మొత్తం 660 పంచాయతీలకు గానూ 414 మండలాలు యుడిఎల ఆధీనంలో ఉన్నాయని మంత్రికి అధికారులు వివరించారు. యుడిఎలు లేఅవుట్ల అనుమతి కోసం పంచాయతీలకు తెలియకుండానే అనుమతులు ఇస్తున్నాయని, దీనివల్ల ఏది అధికారికమో, ఏది అనధికారికమో పంచాయతీలకు తెలియడం లేదని అధికారులు వివరించారు. ఇకపై యుడిఎ అనుమతులు ఇచ్చే క్రమంలో పంచాయతీ అనుమతి ఖచ్చితంగా ఉండేలా చేయడం వల్ల ఈ సమస్యను పరిష్కరించాలని, అందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని ఈ సందర్భంగా మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులకు సూచించారు. అలాగే పంచాయతీల పరిధిలో లేఅవుట్ల అనుమతులకు వసూలు చేస్తున్న ఫీజులో యాబైశాతం పంచాయతీలకు రావాల్సి ఉందని, దీనికి సహకరించాలని డిటిసిపి అధికారులను కోరారు.

ఈ సమావేశంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, పిఆర్ అండ్ ఆర్డీ కమిషనర్ గిరిజాశంకర్, సెర్ప్ సిఇఓ ఎన్ఎండి ఇంతియాజ్ తదితరులు పాల్గొన్నారు.

Check Also

కేంద్ర ప్ర‌భుత్వం రూ.1100 కోట్ల వ‌ర‌ద సాయాన్ని త్వ‌ర‌గా అందించాలి : ఎంపి కేశినేని శివ‌నాథ్

-కేంద్ర హోం శాఖ‌ మంత్రి అమిత్ షా కు విజ్ఞ‌ప్తి -విపత్తు నిర్వహణ (సవరణ) బిల్లు- 2024కు ఆమోదం -విజయవాడ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *