-సామాన్య ప్రజలకు సైతం ఉపయుక్తంగా ‘డయాబెటిస్ అట్లాస్’
-డాక్టర్ వీజీఆర్ కు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ప్రశంసలు
-ప్రజాడైరీ వార్షికోత్సవంలో డాక్టర్ వీజీఆర్ కు ఘనసన్మానం
-సేవా కార్యక్రమాలను మరింత విస్తరిస్తామని డాక్టర్ వీజీఆర్ వెల్లడి
హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త :
మధుమేహ వ్యాధి పట్ల ప్రజల్లో అవగాహన పెంపొందించడంతో పాటు, పర్యావరణ పరిరక్షణకు డాక్టర్ కె వేణుగోపాలరెడ్డి అందిస్తున్న సేవలు అద్వితీయమైనవని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ప్రశంసించారు. సోమాజీగూడ ప్రెస్ క్లబ్ నందు జరిగిన ప్రజాడైరీ 21వ వార్షికోత్సవ సభకు గవర్నరు బండారు దత్తాత్రేయ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. మధుమేహవ్యాధి గురించి ప్రజల్లో అవగాహన కలిగించే లక్ష్యంతో డాక్టర్ వీజీఆర్ రూపొందించిన ‘డయాబెటిస్ అట్లాస్’ను గవర్నరు దత్తాత్రేయ పరిశీలించారు. మధుమేహవ్యాధికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని పొందుపరచి, సామాన్యులకు సైతం ఉపయుక్తంగా ఉండేలా డయాబెటిస్ అట్లాస్ ను తీర్చిదిద్దటం అభినందనీయమని దత్తాత్రేయ ఈ సందర్భంగా పేర్కొన్నారు. డయాబెటిస్ పై అవగాహన కల్పించేందుకు అనేక కార్యక్రమాలను నిర్వహించడంతో పాటు, వ్యాధి గురించి విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు రికార్డుస్థాయిలో వ్యాసరచన పోటీలను నిర్వహించడం అనితరసాధ్యమని కొనియాడారు. అత్యాధునిక వైద్యసేవలందిస్తూ ఎంతోమందిని ఆరోగ్యవంతులుగా చేస్తున్న డాక్టర్ వీజీఆర్.. పర్యావరణ పరిరక్షణ ఉద్యమాన్ని సైతం భుజాలకెత్తుకోవడం హర్షణీయమని అన్నారు. స్వయంగా మొక్కలు నాటే కార్యక్రమాలను నిర్వహించడమే కాకుండా, పలు గ్రామాల్లో వేలాది మొక్కలను ఉచితంగా పంపిణీ చేయడం స్ఫూర్తిదాయకమని హర్యానా గవర్నరు బండారు దత్తాత్రేయ తెలిపారు. కార్యక్రమంలో భాగంగా నిర్వాహకులు డాక్టర్ కె వేణుగోపాలరెడ్డిని గవర్నరు చేతుల మీదుగా ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీ నటుడు భానుచందర్, ప్రజాడైరీ నిర్వాహకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ కె వేణుగోపాలరెడ్డి మీడియాతో మాట్లాడుతూ మధుమేహవ్యాధి పట్ల పూర్తి అవగాహన కలిగివుండటం, సరైన సమయంలో చికిత్స తీసుకోవడం ద్వారా షుగర్ వ్యాధి దుష్ప్రభావాల నుంచి తప్పించుకోవచ్చని అన్నారు. డాక్టర్ వీజీఆర్ డయాబెటిస్ స్పెషాలిటీస్ హాస్పిటల్, వీజీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనేక ఉచిత వైద్య శిబిరాలను, అవగాహన సదస్సులను నిర్వహించామని తెలిపారు. మధుమేహవ్యాధికి సంబంధించిన సమగ్ర సమాచారంతో డయాబెటిస్ అట్లాస్ రెండు సంచికలను ప్రచురించి, వేలాది ప్రతులను ప్రజలకు ఉచితంగా అందజేస్తున్నామని అన్నారు. షుగర్ వ్యాధి పట్ల ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు గాను వందలాది టీవీ, రేడియో కార్యక్రమాల్లో పాల్గొన్నట్లు పేర్కొన్నారు. మధుమేహం పట్ల చిన్నారులకు అవగాహన కల్పించడం ద్వారా, వారి కుటుంబసభ్యులందరికీ వ్యాధి గురించి అవగాహన కల్పించవచ్చనే దార్శనికతతో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించినట్లు వివరించారు. వివిధ పాఠశాలల్లో ఒకే సమయంలో నిర్వహించిన ఈ కార్యక్రమం అనేక రికార్డులను సొంతం చేసుకోవడం విశేషమని అన్నారు. వీజీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గత పదేళ్లుగా హరితయజ్ఞాన్ని కొనసాగిస్తున్నామని, ప్రతి ఏటా నిర్విరామంగా మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. కడియం పల్లా వెంకన్న నర్సరీ నుంచి వేలాది మొక్కలను తీసుకొచ్చి వివిధ గ్రామాల్లో ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు దాదాపు 35 వేల మొక్కలను ఉచితంగా అందజేశామని వెల్లడించారు. తమ సేవలకు గుర్తింపుగా హర్యానా గవర్నరు బండారు దత్తాత్రేయ నుంచి అభినందనలు అందుకోవడం సంతోషంగా ఉందని, ఈ స్ఫూర్తితో సేవా కార్యక్రమాలను మరింత విస్తృతం చేస్తామని డాక్టర్ వేణుగోపాలరెడ్డి పేర్కొన్నారు.