ఎన్నిక‌ల ప్ర‌తి ద‌శ‌లోనూ అత్యంత అప్ర‌మ‌త్తం

– పోలింగ్ ప్ర‌క్రియ‌ను క్షేత్ర‌స్థాయిలో ప‌రిశీలించిన జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌
– రిసెప్ష‌న్ సెంట‌ర్‌తో పాటు కౌంటింగ్ హాల్‌లో ఏర్పాట్ల త‌నిఖీ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లోని ప్ర‌తి ద‌శ‌లోనూ అత్యంత అప్ర‌మ‌త్తంగా వ్య‌వ‌హ‌రిస్తున్నామ‌ని.. ఎక్క‌డా ఎలాంటి లోటుపాట్ల‌కు తావులేకుండా ప‌క‌డ్బందీ ఏర్పాట్ల‌తో ప‌టిష్ట స‌మ‌న్వ‌యంతో ప‌నిచేస్తున్న‌ట్లు జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ తెలిపారు.
ఆదివారం విజ‌య‌వాడ న‌గ‌ర‌పాల‌క సంస్థ‌తో పాటు కొండ‌ప‌ల్లి, తిరువూరు, నందిగామ‌, జ‌గ్గ‌య్య‌పేట మున్సిపాలిటీల‌ ఎన్నిక‌ల నేప‌థ్యంలో క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ క్షేత్ర‌స్థాయిలో విస్తృతంగా ప‌ర్య‌టించారు. ఇందులో భాగంగా ఇబ్ర‌హీంప‌ట్నం ఆక్ప్‌ఫ‌ర్డ్ స్కూల్‌లోని పోలింగ్ కేంద్రాన్ని సంద‌ర్శించారు. అదేవిధంగా కొండ‌ప‌ల్లి జిల్లాప‌రిష‌త్ ఉన్న‌త‌పాఠ‌శాల పోలింగ్ కేంద్రాన్ని ప‌రిశీలించారు. ఈ సందర్భంగా పోలింగ్ ప్రక్రియ కొనసాగుతున్న తీరును, ఎన్నికల సిబ్బంది విధుల నిర్వహణను ప‌రిశీలించారు. ఓటర్లకు కల్పించిన సౌకర్యాలు, పోలింగ్ కేంద్రంలో చేపట్టిన ఏర్పాట్లను పరిశీలించి ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో, నిబంధనలకు అనుగుణంగా జరిగేలా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. అదేవిధంగా పోలింగ్ అనంత‌రం కీల‌క‌పాత్ర పోషించే రిసెప్ష‌న్ సెంట‌ర్‌, కౌంటింగ్ కేంద్రాల్లో ఏర్పాట్ల‌ను త‌నిఖీ చేశారు. పోలింగ్ సామగ్రి స్వీకరణ, భద్రపరిచే విధానం, స్ట్రాంగ్ రూమ్‌ల భద్రత, ఓట్ల లెక్కింపు కోసం కల్పిస్తున్న మౌలిక సదుపాయాలు, అవసరమైన మౌలిక ఏర్పాట్లను పరిశీలించారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని, పోలింగ్ అనంతర ప్రక్రియలో ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా సంబంధిత అధికారులు సమన్వయంతో వ్యవహరించాలని క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ సూచించారు.