తుపానుతో దెబ్బతిన్న అరటి తోటలను పరిశీలించిన కేంద్ర బృందం

పిఠాపురం, నేటి పత్రిక ప్రజావార్త:
అర్నబ్ తుపాను ప్రభావంతో దెబ్బతిన్న అరటి తోటలను కేంద్ర అంతర్ మంత్రిత్వ శాఖల బృందం ఆదివారం కాకినాడ జిల్లా పిఠాపురం మండలం వీరవాడ గ్రామంలో పరిశీలించింది. ఈ సందర్భంగా బాధిత రైతుతో మాట్లాడి పంట నష్టం, పెట్టుబడి, ఆశించిన దిగుబడి, ఆర్థిక నష్టాల వివరాలను అడిగి తెలుసుకుంది. 3.50 ఎకరాల్లో సాగు చేసిన కర్పూరం, చెక్కకేళి రకాల అరటి పంట కోతకు సిద్ధంగా ఉన్న సమయంలో తీవ్ర గాలులకు నేలకొరిగిందని అధికారులు వివరించారు. 50 శాతానికి పైగా పంట నష్టం జరిగినట్లు గుర్తించారు. ఇప్పటివరకు సుమారు రూ.1.20 లక్షలు పెట్టుబడి పెట్టినట్లు తెలిపారు. అర్హులైన అరటి రైతులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం హెక్టారుకు రూ.35 వేల చొప్పున నష్టపరిహారం అందించనున్నట్లు జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ తెలిపారు. పంట నష్టంపై సేకరించిన వివరాలను నివేదికలో పొందుపరిచి ప్రభుత్వానికి సమర్పించనున్నట్లు కేంద్ర బృందం వెల్లడించింది. ఈ పర్యటనలో జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్, ఉద్యాన శాఖ అధికారులు పాల్గొన్నారు.