-ధైర్యంగా పరీక్షలను ఎదుర్కొనేందుకు సన్నద్ధం కండి..
-జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పరీక్షలు సమీపిస్తున్న సమయంలో విద్యార్థులకు అత్యంత కీలకమైన సమయమని ధైర్యంగా పరీక్షలను ఎదురుకుని ఉత్తమ ఫలితాలు సాధించాలని జిల్లా కలెక్టర్ డా. జి లక్ష్మీశ విద్యార్థులకు సూచించారు. మార్చి 16వ తేదిన 10వ తరగతి పరీక్షలు నిర్వహిస్తున్న నేపథ్యంలో శనివారం జిల్లా. కలెక్టర్ డా. జి. లక్ష్మీశ ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లి జిల్లా పరిషత్ హైస్కూల్ ను సందర్శించి విద్యార్థుల విద్యా భోదనను పరిశీలించారు.
ఈ సందర్భంగా పదవ తరగతి విద్యార్థులతో జిల్లా కలెక్టర్ ముచ్చటిస్తూ విద్యార్థుల మేధా శక్తిని పరిశీలించారు. పాఠ్యాంశాలపై పలు ప్రశ్నలు వేసి విద్యార్థుల నుండి సమాదానాలను రాబట్టారు. గణితం, సైన్స్, సోషల్ స్టడీస్ కు సంబంధించి విద్యార్థులు ఇచ్చిన సమాదానాల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులు ఏ విషయాన్ని చదువుతున్నా 360 డిగ్రీ కోణంతో అధ్యయనం చేయాలని.. అప్పుడే నేర్చుకున్న విషయాలు పరీక్షలకే పరిమితం కాకుండా జీవితాంతం గుతుంటాయన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే ఎందరో తమ మేధస్సుతో నిత్యం నేర్చుకోవాలనే తపనతో ప్రశ్నిస్తూ, నేర్చుకుంటూ ఉన్నత స్థానాలకు ఎదిగారని అటువంటి వారిని స్ఫూర్తిగా తీసుకొని కష్టమైన, ఇష్టపడి చదువుకున్నప్పుడు మంచి ఫలితాలు సాధించగలుగుతారన్నారు. విద్యార్థులపై తల్లిదండ్రులు పెట్టుకున్న నమ్మకాన్ని రెట్టింపు చేసేలా ఫలితాలు సాధించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. విద్యార్థి జీవితాన్ని మలుపు తిప్పేది పదవ తరగతి పరీక్షలేనని పదవ తరగతి పరీక్ష పాస్ అయితే ఉన్నత చదువులు చదివేందుకు మార్గం సుగమం అవుతుందన్నారు. ఈ విషయాన్ని గుర్తించి ఉపాధ్యాయులు ప్రతి విద్యార్థి పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించేలా కృషిచేయాలన్నారు. సబ్జెక్టు ఉపాధ్యాయులు ఆయా సబ్జెక్టులలో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టిపెట్టి వారికి అర్ధమయ్యే రీతిలో బోధించి పరీక్షలను ఎదుర్కొనేందుకు సన్నద్ధం చేయాలన్నారు. పరీక్షలకు హాజరయ్యే పద్ధతి, ప్రశ్నకు సంబంధించి జవాబు వ్రాసే విధానం వంటి విషయాలను విద్యార్థులకు సూచించేలా ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలన్నారు. పదవ తరగతి విద్యార్థులతో పాటు మిగిలిన తరగతుల విద్యార్థులపై కూడా అంతే శ్రద్ధ కనపరచాలన్నారు. పరీక్షలు సమీపిస్తున్న కీలక సమయంలో ఉపాధ్యాయులు సెలవులు వినియోగించవద్దన్నారు. ఉపాధ్యాయులు ఆత్మపరిశీలన, నిబద్ధతతో విద్యార్థులపై దృష్టిపెట్టి పరీక్షలకు సన్నద్ధం చేస్తే నూరు శాతం ఫలితాలు వస్తాయన్నారు. తద్వారా ఉత్తమ ఉపాధ్యాయులుగా విద్యార్థుల తల్లిదండ్రులలో గౌరవం పొంది పాఠశాలకు మంచి పేరు తీసుకువచ్చిన వారవుతారన్నారు. 10వ తరగతి ఫలితాలలో జిల్లాను అగ్రగామిగ నిలిపేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డా. లక్ష్మీశ ఉపాధ్యాయులకు సూచించారు.
పాఠశాల సందర్శనలో జిల్లా కలెక్టర్ వెంట డిఇవో ఎల్. చంద్రకళ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం. సంధ్యారాణి ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది తదితరులు ఉన్నారు.
Prajavartha Online Telugu News