– ఆరోగ్యవంతమైన ఉద్యోగులే సమర్థవంతమైన పాలనకు బలం
– శారీరక దృఢత్వం.. మానసిక ప్రశాతంతకు మార్గం
– మానసిక ఆరోగ్యంతోనే మంచి ఆలోచనలు వస్తాయి
– మహిళా ఉద్యోగుల సామర్థ్యానికి ప్రతీకగా క్రీడా పోటీలు
– జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
-శాప్ ఛైర్మన్ అనిమిని రవి నాయుడు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
శారీరక, మానసిక ఆరోగ్యం ప్రతిఒక్కరి జీవితంలో అత్యంత కీలకమని.. ఫిట్‌గా ఉంటేనే వ్యక్తిగత జీవితం, వృత్తి జీవితంలో ఉత్తమ ఫలితాలు సాధించగలమని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు.
ఏపీ ఎన్జీజీవో అసోసియేషన్ మహిళా ఉద్యోగుల విభాగం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో భాగంగా బుధవారం ఇందిరాగాంధీ మునిసిపల్ మైదానంలో క్రీడా పోటీలను జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ.. శాప్ ఛైర్మన్ అనిమిని రవినాయుడు, ఏపీ ఎన్‌జీజీవో రాష్ట్ర అధ్యక్షులు ఎ.విద్యాసాగర్, ప్రధాన కార్యదర్శి డీవీ రమణ, ఎపీ ఎన్‌జీజీవో మహిళా విభాగం రాష్ట్ర ఛైర్‌పర్సన్ నిర్మలకుమారి, కన్వీనర్ పి.మాధవి తదితరులతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ మనం చేసే పనిద్వారా మంచి ఫలితాలు సాధించాలంటే శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యమూ ముఖ్యమేనని.. అందుకే రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా యోగాంధ్ర మాసోత్సవాలు నిర్వహించినట్లు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండటం సమర్థవంతమైన పాలనకు కీలకమని.. ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలంటే ఉద్యోగులు ఉత్సాహం, ఏకాగ్రత, సానుకూల దృక్పథంతో పనిచేయాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. మానసిక ప్రశాంతత ఉంటే నిర్ణయాలు స్పష్టంగా తీసుకోవచ్చని, ఒత్తిడిని సమర్థంగా ఎదుర్కోవచ్చని వివరించారు. ఈ నేపథ్యంలో ఏపీ ఎన్‌జీజీవో మహిళా విభాగం ఆధ్వర్యంలో ఇలాంటి క్రీడా పోటీలు నిర్వహించడం స్ఫూర్తిదాయకం, అభినందనీయమని కలెక్టర్ లక్ష్మీశ పేర్కొన్నారు.
ఆడాలి.. ఆనందంగా ఉండాలి: శాప్ ఛైర్మన్ అనిమిని రవినాయుడు
మహిళా ఉద్యోగులను చైతన్యవంతులను చేసి కొత్త ఉత్సాహంతో ముందుకెళ్లేలా చేసేందుకు క్రీడా పోటీలు నిర్వహించడం అభినందనీయమని శాప్ ఛైర్మన్ అనిమిని రవినాయుడు పేర్కొన్నారు. వ్యవస్థలు సజావుగా ముందుకెళ్తున్నాయంటే అందుకు ఉద్యోగుల సమర్థతే కారణమని, సమాజ హితం కోసం నిత్యం శ్రమిస్తున్న ఉద్యోగులు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండటం ముఖ్యమని అన్నారు. ఇందుకు క్రీడలు, నిత్య వ్యాయామం దోహదం చేస్తాయన్నారు. ఒత్తిడిని అధిగమించి కొత్త ఉత్సాహంతో చేస్తున్న పని ద్వారా మంచి ఫలితాలు సాధించేందుకు క్రీడలు దోహదం చేస్తాయని పేర్కొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి ఆరోగ్య ఆంధ్ర, క్రీడాంధ్ర సాధన దిశగా దిశానిర్దేశం చేస్తున్నారన్నారు. గౌరవ పీఎం ఫిట్ ఇండియా ద్వారా ప్రతిఒక్కరినీ భాగస్వాములను చేస్తున్నారని రవినాయుడు అన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో వివిధ క్రీడలను విజయవంతంగా నిర్వహిస్తున్నామని.. భవిష్యత్తులో గౌరవ ప్రజాప్రతినిధులు, ఐఏఎస్, ఐపీఎస్ తదితర అధికారులతో మూడు నాలుగు రోజులపాటు క్రీడా పోటీలను నిర్వహించాలనే యోచనలో ఉన్నట్లు రవినాయుడు తెలిపారు. ఉద్యోగుల సంక్షేమంపై ఈ ప్రభుత్వం దృష్టిసారిస్తోందని.. ఇది ఉద్యోగులు గౌరవంగా జీవించేలా చేయాలన్న తపన ఉన్న ప్రభుత్వమని పేర్కొన్నారు.
ఏపీ ఎన్‌జీజీవో రాష్ట్ర అధ్యక్షులు ఎ.విద్యాసాగర్ మాట్లాడుతూ…
క్రీడలు ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా జట్టు భావన, నాయకత్వ లక్షణాలు, సమయపాలన, ఆత్మవిశ్వాసం వంటి గుణాలను పెంపొందిస్తాయని చెప్పారు. కార్యాలయ పనులతో పాటు ఆరోగ్యంపై కూడా దృష్టి పెట్టాలని సూచించారు. మహిళా ఉద్యోగులు ప్రతి రంగంలోనూ ముందంజలో ఉన్నారని, క్రీడల్లోనూ తమ ప్రతిభను చాటుకోవాలని ఆకాంక్షించారు. ఇటువంటి కార్యక్రమాలు ఉద్యోగుల్లో ఉత్సాహాన్ని పెంపొందించడంతో పాటు పరస్పర అవగాహన, ఐక్యతను బలోపేతం చేస్తాయని పేర్కొన్నారు. ఏటా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా విభాగం ఆధ్వర్యంలో విజయవంతంగా క్రీడా పోటీలను నిర్వహించడంలో భాగస్వాములమవుతున్న ప్రతిఒక్కరికీ అభినందనలు తెలియజేస్తున్నట్లు విద్యాసాగర్ అన్నారు.
ఏపీ ఎన్‌జీజీవో మహిళా విభాగం రాష్ట్ర ఛైర్‌పర్సన్ నిర్మలకుమారి మాట్లాడుతూ..
ఆరోగ్యకర జీవనశైలిని అలవర్చుకోవడం ద్వారా సమాజానికి ఆదర్శంగా నిలవాలనే లక్ష్యంతో ఏటా క్రీడా పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉద్యోగ బాధ్యతలు, కుటుంబ బాధ్యతల మధ్య సమతుల్యత సాధించాలంటే శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండటం అత్యంత అవసరమని పేర్కొన్నారు. కార్యాలయాల్లో ఏర్పడే ఒత్తిడిని తగ్గించడంలో క్రీడలు కీలక పాత్ర పోషిస్తాయని, ఉద్యోగుల్లో సానుకూల దృక్పథాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. శారీరకంగా దృఢంగా ఉంటే పనితీరు మెరుగుపడుతుందని, మానసిక ప్రశాంతతతో తీసుకునే నిర్ణయాలు శాఖ ప్రతిష్ఠను పెంచుతాయని పేర్కొన్నారు. మహిళా ఉద్యోగులు ప్రతి రంగంలోనూ తమ ప్రతిభను చాటుతున్న ఈ సమయంలో, క్రీడా వేదికల ద్వారా వారి సామర్థ్యాన్ని మరింత వెలుగులోకి తీసుకురావడమే ఈ కార్యక్రమాల ముఖ్య ఉద్దేశమని నిర్మలకుమారి తెలిపారు.
కార్యక్రమంలో ఏపీ ఎన్‌జీజీవో మహిళా విభాగం రాష్ట్ర కన్వీనర్ పి.మాధవి ప్రతినిధులు కె.శివలీల, వి.శాంతిశ్రీ, బి.జానకి, ఎం.సరస్వతి, బి.విజయశ్రీ, సీహెచ్ నాగమల్లేశ్వరి, ఎస్.దివ్య, వి.సురేఖ, పి.తులసీరత్నం తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News