-ఆంధ్రప్రదేశ్‌కు రూ.137.81 కోట్ల సబ్సిడీ
-లోకసభ లో విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాధ్ (చిన్ని ) వేసిన ప్రశ్నకు కేంద్రం సమాధానం
న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త :
దేశవ్యాప్తంగా సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న
ప్రధాన మంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ (Pradhan Mantri Formalisation of Micro Food Processing Enterprises Scheme (PMFME) పథకం ద్వారా లక్షలాది చిన్న వ్యాపారాలకు మద్దతు లభిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ప్రధాన మంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం విషియమై లోక్‌సభలో విజయవాడ ఎంపీ కేశినేని శివనాధ్ (చిన్ని )అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి రావనీత్ సింగ్ బిట్టు ( Ravneet Singh Bittu) తెలిపారు. పథకం ప్రారంభం నుంచి 2025 డిసెంబర్ 31 వరకు దేశవ్యాప్తంగా 1,72,707 సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లకు రుణాలు మంజూరు అయ్యాయని వివరించారు. ఈ రుణాలు క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ విధానంలో వ్యక్తిగతంగా లేదా గ్రూప్ కేటగిరీలోని చిన్న పరిశ్రమలకు అందించబడుతున్నాయన్నారు.
దేశవ్యాప్తంగా ఈ పథకం కింద మొత్తం 4,52,596 దరఖాస్తులు అందగా, వాటిలో 1,72,707 దరఖాస్తులకు రుణాలు మంజూరు అయ్యాయన్నారు. మరో 54,894 దరఖాస్తులు ప్రస్తుతం బ్యాంకుల వద్ద పెండింగ్‌లో ఉన్నాయని మంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి 16,281 దరఖాస్తులు వచ్చాయని, వాటిలో 8,651 సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లకు రుణాలు మంజూరు కాగా, 1,359 దరఖాస్తులు ఇంకా బ్యాంకుల వద్ద పెండింగ్‌లో ఉన్నాయని వెల్లడించారు. సబ్సిడీ విషయానికి వస్తే, పథకం ప్రారంభం నుంచి దేశవ్యాప్తంగా రూ.5009.61 కోట్ల సబ్సిడీకి ఆమోదం లభించిందన్నారు ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే రూ.137.81 కోట్ల సబ్సిడీ మంజూరైనట్లు మంత్రి తెలిపారు.
ఈ పథకం గురించి ప్రజల్లో అవగాహన పెంచేందుకు కేంద్రం మరియు రాష్ట్రాలు కలిసి పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయన్నారు. పత్రికా ప్రకటనలు, రేడియో జింగిల్స్, ఎగ్జిబిషన్లు, ఎక్స్‌పోలు, జాతరలు, బయ్యర్-సెల్లర్ మీటింగ్స్ వంటి కార్యక్రమాల ద్వారా మహిళా సంఘాలు సహా వివిధ వర్గాల ప్రజలకు ప్రచారం నిర్వహిస్తున్నట్లు కేంద్రం తెలిపింది. ప్రచార కార్యక్రమాలకు ప్రత్యేకంగా జిల్లా వారీ బడ్జెట్ లేకపోయినా, రాష్ట్రాలకు కేటాయించిన మొత్తం బడ్జెట్లో 1 శాతం వరకు ఖర్చు చేసి ప్రచార కార్యక్రమాలు నిర్వహించే అధికారం ఇచ్చినట్లు మంత్రి వివరించారు.
Prajavartha Online Telugu News