Breaking News

రాష్ట్రంలో ఎల్పీజీ గ్యాస్ కొరత లేదు

-ఎప్పటికప్పుడు సరఫరాను పర్యవేక్షిస్తున్నాం
-గృహ వినియోగదారులకు ఇబ్బందులు రాకుండా చూసుకుంటాం
-గ్యాస్ బ్లాక్ మార్కెట్ కు తరలిపోకుండా నిఘా బృందాలు
-అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో గ్యాస్ సరఫరాపై ఉన్నతాధికారులతో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్  టెలీ కాన్ఫరెన్స్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
‘రాష్ట్రంలో ఎల్పీజీ గ్యాస్ కొరత లేదు. ప్రజలెవరూ దీనిపై అనవసరమైన ఆందోళనకి గురి కావాల్సిన అవసరం లేద’ని రాష్ట్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. గృహ అవసరాలకు, వాణిజ్య అవసరాలకు సరిపడా గ్యాస్ నిల్వలు ఉన్నాయని, ప్రస్తుతానికి ఇబ్బంది ఏమీ లేదని తెలిపారు. కీలకమైన ఈ సమయంలో ఎల్పీజీ గ్యాస్ అక్రమంగా బ్లాక్ మార్కెట్ కు తరలిపోకుండా జిల్లాలవారీగా చర్యలు తీసుకోవాలనీ, ఆయా జిల్లాల జాయింట్ కలెక్టర్లు దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని ఆదేశించారు. అంతర్జాతీయ యుద్ధ వాతావరణం నేపథ్యంలో రాష్ట్రంలో గ్యాస్ సరఫరా గురించి మంత్రివర్యులు మనోహర్ మంగళవారం ఉన్నతాధికారులతో టెలీ కాన్ఫరెన్సు ద్వారా సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం రాష్ట్రానికి అందుబాటులో ఉన్న గ్యాస్ నిల్వల సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ… ‘‘గృహ అవసరాలకు గ్యాస్ సరఫరాలో ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటున్నాం. అవసరం అయితే వాణిజ్య అవసరాలకు అందించే ఎల్పీజీ గ్యాస్ ను ప్రాధాన్యతల ప్రకారం అందించే ఏర్పాటు చేస్తాం. ప్రస్తుతానికి రాష్ట్రానికి సంబంధించి హెచ్పీసీ విశాఖపట్నం రిఫైనరీ, మంగళూరు నుంచి వచ్చే హస్సన్ చర్లపల్లి పైపులైను, విశాఖలోని హెచ్పీసీ, బీపీసీ, ఐఓసీల ద్వారా రాష్ట్రం నుంచి సరఫరా అవుతున్న గ్యాస్ సరఫరాపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నాం. రోజువారీ అవసరాలకు సరిపడా నిల్వల్లో ఏ మాత్రం తేడా వచ్చినా, ప్రత్యామ్నాయంగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై ముందుకు వెళ్తాం. రాష్ట్ర ప్రజలు ఇబ్బందులుపడకుండా చర్యలు తీసుకుంటాం. ఈ విషయంలో యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉండాలి.
బ్లాక్ మార్కెట్ కు తరలిపోకుండా నిఘా పర్యవేక్షణ
ప్రత్యేక నిఘా బృందాలను నియమించుకొని గ్యాస్ పక్కదోవ పట్టకుండా జాయింట్ కలెక్టర్లు నియంత్రించాలి. రకరకాల పుకార్లతో ఇష్టానుసారం ధరలు పెంచినా, వదంతులు వ్యాప్తి చేసినా కఠిన చర్యలు తీసుకోవాలి. ఎప్పటికప్పుడు జిల్లాల వారీగా సరఫరా చైన్ ను పర్యవేక్షిస్తూ, ఎక్కడైనా సరఫరాలో లోపాలు వస్తే వెంటనే సరిదిద్దే ఏర్పాట్లు చేయాలి. రాష్ట్ర కార్యాలయం నుంచి ఉన్నతాధికారులు సైతం గ్యాస్ సరఫరాపై ప్రత్యేకంగా దృష్టి నిలపాలి. ప్రజలు కూడా సోషల్ మీడియాలో వచ్చే సమాచారాన్ని చూసి భయపడొద్దు. ప్రస్తుతం మన దగ్గర అంతర్జాతీయ యుద్ధ వాతావరణం తాలుకా ప్రభావం ఏమీ లేదు. కేంద్ర ప్రభుత్వం సైతం దీనిపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తోంది” అన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

బకాయి ఉన్నపన్ను వసూళ్లకు యుద్దప్రాతిపదిక యాక్షన్ ప్లాన్ మేరకు వెళ్లాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థకు బకాయి ఉన్నపన్ను వసూళ్లకు యుద్దప్రాతిపదిక యాక్షన్ ప్లాన్ మేరకు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *