ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతున్న ఇ.యూనియన్‌ను బలోపేతం చేయాలి

-డిసెంబర్ 2 నుంచి మూసివేసిన నాలుగు డిపోల పునర్నిర్మాణ పనులు ప్రారంభం
-మంగళగిరి డిపోలో నాలుగేళ్లుగా పెండింగ్‌లో ఉన్న డ్యూటీ చార్టులను వెంటనే ప్రకటించాలి
-సీసీఎస్ ఎన్నికల్లో ఇ.యూ. బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలి: రాష్ట్ర అధ్యక్షుడు పలిశెట్టి దామోదరరావు

మంగళగిరి, నేటి పత్రిక ప్రజావార్త:
ఆర్టీసీ ఉద్యోగుల హక్కుల పరిరక్షణ, సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతున్న ఎంప్లాయీస్ యూనియన్‌ (ఇ.యూ.)ను ఉద్యోగులందరూ సంస్థాగతంగా బలోపేతం చేయాలని ఆ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పలిశెట్టి దామోదరరావు పిలుపునిచ్చారు. డిసెంబర్‌లో జరగనున్న ఏపీఎస్‌ఆర్టీసీ క్రెడిట్ కో-ఆపరేటివ్ సొసైటీ (సీసీఎస్‌) ఎన్నికల్లో ఇ.యూ. బలపరిచిన అభ్యర్థులను రాష్ట్రవ్యాప్తంగా గెలిపించాలని కోరారు.

మంగళవారం మంగళగిరి సీపీఐ కార్యాలయంలో డిపో ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ జనరల్ బాడీ సమావేశం డిపో అధ్యక్షుడు బి. సాంబశివరావు అధ్యక్షతన, డిపో కార్యదర్శి వి. నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన పలిశెట్టి దామోదరరావు మాట్లాడుతూ ఉద్యోగుల సంక్షేమం, ఆర్టీసీ సంస్థ పరిరక్షణే లక్ష్యంగా ఇ.యూ. నిరంతరం పోరాటాలు నిర్వహిస్తోందన్నారు.

విద్యుత్ బస్సుల పేరుతో రాష్ట్రంలో మూసివేసిన గుంటూరు-2, విజయవాడ విద్యాధరపురం, నెల్లూరు-2, మంగళం డిపోలను పునర్నిర్మిస్తామని ఆర్టీసీ జేఏసీ ఉద్యమ ఫలితంగా హామీ లభించిందని తెలిపారు. డిసెంబర్ 2 నుంచి ఈ నాలుగు డిపోల పునర్నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని, ఆరు నెలల్లో డిపోలను తిరిగి ప్రారంభించేలా చర్యలు చేపడతారని వివరించారు.

ఉద్యోగుల పెండింగ్ సమస్యల పరిష్కారం, వేతన సవరణలు, డీఏ బకాయిల చెల్లింపు, పీఎఫ్‌, అధిక పెన్షన్ సమస్యల పరిష్కారం, కారుణ్య నియామకాలు, పదోన్నతులు, ఉద్యోగ భద్రత, కొత్త బస్సుల కొనుగోలు, ఖాళీ పోస్టుల భర్తీ వంటి అంశాలపై యూనియన్ నిరంతరం పోరాడుతోందని పేర్కొన్నారు.

విద్యుత్ బస్సుల పేరుతో ఆర్టీసీని ప్రైవేటీకరణ దిశగా నడిపించే విధానాలను యూనియన్ వ్యతిరేకిస్తోందన్నారు. విద్యుత్ బస్సులను ఆర్టీసీ సంస్థే స్వయంగా కొనుగోలు చేసి నిర్వహించాలన్న డిమాండ్‌తో ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో భవిష్యత్తులోనూ ఉద్యమాలు కొనసాగిస్తామని తెలిపారు. 1,450 విద్యుత్ బస్సుల టెండర్ల విషయంలో ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడేందుకు ఇప్పటికే ఉద్యమ కార్యాచరణ చేపట్టినట్లు వివరించారు.

యూనియన్‌పై నమ్మకంతో ప్రతి ఉద్యోగి సంస్థాగతంగా బలోపేతం చేయాలని, వ్యక్తిగత ప్రయోజనాల కంటే సమిష్టి ప్రయోజనాలకు ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగాలని ఇ.యూ. రాష్ట్ర సహాయ కార్యదర్శి డి.వి. స్వామి పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా ఇ.యూ. జిల్లా కార్యదర్శి ఇ. విజయకుమార్ మాట్లాడుతూ మంగళగిరి డిపోలో పనిచేస్తున్న అసిస్టెంట్ మేనేజర్ (ట్రాఫిక్) ఉద్యోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ, వారిని కించపరిచే విధంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. ఇటువంటి ఏకపక్ష నిర్ణయాలు, వ్యవహారశైలిని మానుకోవాలని సూచించారు. ముఖ్యంగా నాలుగేళ్లుగా పెండింగ్‌లో ఉన్న డ్యూటీ చార్టులను ఉద్యోగుల సీనియారిటీ ప్రకారం వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారం కాకపోతే జిల్లా వ్యాప్తంగా ఉద్యమం చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు.

ఈ సమావేశంలో ఇ.యూ. జోనల్ నాయకులు ఐ. రాజేష్ ఖన్నా, జి. ప్రకాష్, జిల్లా అధ్యక్షుడు ఎస్.కె. కరీముల్లా, జిల్లా కార్యదర్శి ఇ. విజయకుమార్, జిల్లా నాయకుడు పి. సత్యనారాయణ, డిపో ముఖ్య సలహాదారు ఎం. మనోరంజన్ కుమార్‌తో పాటు డిపో కార్యవర్గ సభ్యులు, పెద్ద సంఖ్యలో ఆర్టీసీ ఉద్యోగులు పాల్గొన్నారు.