రాష్ట్రాల ఎస్‌అండ్‌టీ స్కోర్‌బోర్డులో ఇన్నోవేషన్‌ సూచికలు

-గ్లోబల్‌, ఇండియా ఇన్నోవేషన్‌ ఇండెక్స్‌లకు చోటివ్వాలి
-ఆర్‌అండ్‌డీకి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగినన్ని నిధులు కేటాయించాలి: డాక్టర్‌ హెచ్‌. పురుషోత్తం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
రాష్ట్రాల్లో సైన్స్‌, టెక్నాలజీ, ఆవిష్కరణల రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఇండియా సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ (ఎస్‌అండ్‌టీ) స్కోర్‌బోర్డులో గ్లోబల్‌ ఇన్నోవేషన్‌ ఇండెక్స్‌ (జీఐఐ), ఇండియా ఇన్నోవేషన్‌ ఇండెక్స్‌ పనితీరు సూచికలను చేర్చాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ సైన్స్‌, టెక్నాలజీ అండ్‌ ఇన్నోవేషన్‌ శాఖ కార్యదర్శి డాక్టర్‌ హెచ్‌. పురుషోత్తం సూచించారు. దీనివల్ల రాష్ట్రాల ఆవిష్కరణ సామర్థ్యాన్ని సమగ్రంగా అంచనా వేయడంతోపాటు వాటి పనితీరును పోల్చి విశ్లేషించేందుకు వీలవుతుందని పేర్కొన్నారు.
న్యూఢిల్లీలో నీతి ఆయోగ్‌ నిర్వహించిన ఇండియా సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ స్కోర్‌బోర్డు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పరిశోధన, అభివృద్ధి (ఆర్‌అండ్‌డీ) కార్యకలాపాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగినన్ని నిధులు కేటాయించాలని అభిప్రాయపడ్డారు. కేంద్రం రాష్ట్రాలకు సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ బడ్జెట్‌ కింద అవసరమైన ఆర్థిక సహకారం అందించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వార్షిక బడ్జెట్లలో పరిశోధనలకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.
పరిశోధనా సంస్థలను బలోపేతం చేయడం, పరిశ్రమలు-విద్యాసంస్థల మధ్య సమన్వయం పెంచడం, స్టార్టప్‌లను ప్రోత్సహించడం అవసరమన్నారు. పరిశోధనల్లో సాధించిన ఫలితాలను ఆచరణాత్మక అనువర్తనాలుగా మార్చినప్పుడే సాంకేతిక అభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో నీతి ఆయోగ్‌ వైస్‌ ఛైర్మన్‌ అశోక్‌ కుమార్‌ లహిరి, సభ్యుడు ప్రొఫెసర్‌ అభయ్‌ కరందికర్‌, సీనియర్‌ సలహాదారు ప్రొఫెసర్‌ వివేక్‌ కుమార్‌ సింగ్‌, కేంద్ర సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ శాఖ కార్యదర్శి ప్రొఫెసర్‌ ఉమేష్‌ వి. వాఘ్మారే, భూ విజ్ఞాన శాస్త్రాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి డాక్టర్‌ టి. శ్రీనివాస కుమార్‌తోపాటు వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రతినిధులు పాల్గొన్నారు.
నీతి ఆయోగ్‌ చేపట్టిన ఈ కార్యక్రమాన్ని పురుషోత్తం అభినందించారు. పరిశోధన, ఆవిష్కరణలు, సాంకేతిక అభివృద్ధి ద్వారా రాష్ట్రంలో సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ రంగాన్ని మరింత పటిష్ఠం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు.