విజయవాడ మేయర్‌గా వంగవీటి రాధాకృష్ణ ఘన విజయం!

Radhababu

-1,30,872 ఓట్ల భారీ మెజారిటీతో రికార్డు.. పుట్టినరోజే రాజకీయ జీవితంలో మరిచిపోలేని మైలురాయి
-విజయవాడ కార్పొరేషన్‌లో కూటమి క్లీన్ స్వీప్.. జనసేన శ్రేణుల్లో సంబరాలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
విజయవాడ నగర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. విజయవాడ నగరపాలక సంస్థ మేయర్ ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణ ఘన విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాయన భాగ్యలక్ష్మిపై 1,30,872 ఓట్ల భారీ ఆధిక్యంతో విజయం నమోదు చేశారు. ఈ విజయంతో విజయవాడ మేయర్ పీఠాన్ని జనసేన పార్టీ కైవసం చేసుకుంది.

పుట్టినరోజే విజయ కిరీటం.. అభిమానుల్లో ఆనందోత్సాహం!
వంగవీటి రాధాకృష్ణకు ఈ విజయం మరింత ప్రత్యేకంగా నిలిచింది. ఆయన పుట్టినరోజు నాడే ఎన్నికల ఫలితాలు వెలువడటంతో అభిమానులు, జనసేన కార్యకర్తల్లో ఆనందం రెట్టింపైంది. ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధించడంతో కౌంటింగ్ కేంద్రం వద్ద అభిమానులు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. పుట్టినరోజు వేడుకలు విజయోత్సవాలుగా మారడంతో పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నెలకొంది.

2,65,888 ఓట్లతో రికార్డు విజయం!
మేయర్ ఎన్నికల్లో వంగవీటి రాధాకృష్ణకు 2,65,888 ఓట్లు పోలయ్యాయి. వైసీపీ అభ్యర్థి రాయన భాగ్యలక్ష్మికి 1,35,016 ఓట్లు లభించాయి. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ఏబీ వెంకటేశ్వరరావుకు 11,137 ఓట్లు వచ్చాయి. దీంతో రాధాకృష్ణ 1,30,872 ఓట్ల భారీ మెజారిటీతో విజయాన్ని అందుకున్నారు.

విజయవాడ కార్పొరేషన్‌లో కూటమి ఆధిపత్యం!

విజయవాడ నగరపాలక సంస్థలోని మొత్తం 86 డివిజన్లలో టీడీపీ 53, జనసేన 19, బీజేపీ 4 స్థానాలను కైవసం చేసుకున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 8 స్థానాలకే పరిమితమైంది. ఒక స్థానంలో సీపీఎం, మరో స్థానంలో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. ఈ ఫలితాలతో నగరపాలక సంస్థలో కూటమి పార్టీల ఆధిపత్యం స్పష్టమైంది.

జనసేన శ్రేణుల్లో ఉత్సాహం.. అభినందనల వెల్లువ!
వంగవీటి రాధాకృష్ణ సాధించిన ఘన విజయంతో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సంబరాలు చేసుకున్నారు. కూటమి నేతలు ఆయన విజయాన్ని స్వాగతిస్తూ అభినందనలు తెలిపారు. పార్టీ శ్రేణుల్లో ఈ విజయం నూతన ఉత్సాహాన్ని నింపింది.

నగరాభివృద్ధిపై ప్రజల ఆశలు!

భారీ మెజారిటీతో విజయం సాధించిన వంగవీటి రాధాకృష్ణపై నగర ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. విజయవాడలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, పారిశుద్ధ్యం, తాగునీటి సమస్యల పరిష్కారం, రహదారుల మెరుగుదల, ట్రాఫిక్ సమస్యల నియంత్రణ వంటి అంశాలపై ఆయన ఎలాంటి చర్యలు చేపడతారన్నది ఇప్పుడు నగర ప్రజల్లో ఆసక్తికరంగా మారింది. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ విజయవాడ నగర అభివృద్ధికి ఆయన కృషి చేయాలని పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.