సామాజిక న్యాయం కోసం దళిత బహుజన పార్టీ అభ్యర్థిని గెలిపించండి… : వడ్లమూరి కృష్ణ స్వరూప్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
సామాజిక న్యాయం సాధన కోసం దళిత బహుజన పార్టీ తరఫున పాయకరావుపేట జడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జెక్కల మంగకు కప్పు సాసర్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు వడ్లమూరి కృష్ణ స్వరూప్ ప్రజలకు పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పాయకరావుపేట జడ్పీటీసీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి కూటమి పార్టీలు మద్దతు ఇవ్వడం దళిత క్రైస్తవ సమాజానికి ఆందోళనకరమైన పరిణామమని పేర్కొన్నారు. ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గంలో దళితుల హక్కులను అణచివేసేందుకు మనువాద భావజాలం కలిగిన పార్టీలు కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. అణగారిన కులాల హక్కుల కోసం నిరంతరం పోరాడుతున్న దళిత బహుజన పార్టీ అభ్యర్థిని గెలిపించడం ద్వారా ప్రజా ఉద్యమానికి మద్దతు తెలిపాలని కోరారు. సామాజిక న్యాయం, సమానత్వం, అణగారిన వర్గాల అభ్యున్నతే పార్టీ ప్రధాన లక్ష్యాలని తెలిపారు.
ఈ సందర్భంగా పాయకరావుపేట జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించిన పార్టీ మేనిఫెస్టోను వడ్లమూరి కృష్ణ స్వరూప్ విడుదల చేశారు.
ఈ కార్యక్రమంలో పాయకరావుపేట 7వ సెగ్మెంట్ పార్టీ అభ్యర్థి బోడపాటి లక్ష్మి, పార్టీ రాష్ట్ర నాయకురాలు దాసరి అన్నపూర్ణ, జిల్లా అధ్యక్షుడు దువ్వాడ చంటిబాబు (దావీఫు) తదితరులు పాల్గొన్నారు.