-చంద్రబాబు డ్రామాలను రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వ్యవసాయ రంగంపై, రాష్ట్ర రైతాంగంపై ప్రతిపక్ష నేత చంద్రబాబుకు ఉన్న చిత్తశుద్ధి ఏపాటిదో శాసనసభ వేదికగా మరోసారి బయటపడిందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఓ ప్రకటనలో తెలిపారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వ్యవసాయరంగానికి ఇస్తున్న ప్రాధాన్యతపై ఆ శాఖ మంత్రి సుదీర్ఘంగా వివరిస్తున్న తరుణంలో పదేపదే తెలుగుదేశం సభ్యులు సభను అడ్డుకోవాలని చూశారన్నారు. రైతాంగానికి మేలు చేకూర్చే అంశాలపై ప్రభుత్వానికి సూచనలు ఇవ్వాలని ముఖ్యమంత్రి అడిగినప్పటికీ.. రాజకీయంగా ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో.. వాటిపై సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ వాటి గురించి ఆలోచన చేస్తున్నారని కానీ చంద్రబాబు మాటలలో ఎక్కడా కూడా ప్రజలకు సంబంధించిన అంశాలు కనిపించలేదన్నారు. చంద్రబాబు గూర్చి కానీ, ఆయన కుటుంబ సభ్యుల గూర్చి కానీ సభలో ఎవరూ పల్లెత్తు మాట మాట్లాడలేదని.. మాట్లాడారని ఆధారాలుంటే బయట పెట్టాలని కోరారు. ఎవరూ అనని మాటలను అన్నట్లు నటించడం చంద్రబాబుకే చెల్లిందన్నారు. ఇటీవల కాలంలో సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రిని సెంట్రల్ టీడీపీ కార్యాలయంలోనే పట్టాభి అనే పెయిడ్ ఆర్టిస్ట్ చేత పరుష పదజాలంతో తిట్టించింది మర్చిపోయారా..? అని చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు. అటువంటి చిల్లర రాజకీయాలు వైఎస్సార్ సీపీకి చేతకావని పేర్కొన్నారు. ఒక రోజు పాటు నిర్వహించదలచిన సమావేశాలను పదిరోజుల పాటు పొడిగించాలన్న మీరే పలాయనం చిత్తగిస్తే ఎలా అని ప్రశ్నించారు. కుప్పం ఫలితాలతో ఘోర పరాజయాన్ని జీర్ణించుకోలేక.. సానుభూతి పొందేందుకు ప్రతిపక్షనేత ఇటువంటి డ్రామాలు ఆడుతున్నారన్నారు. చంద్రబాబును జీవితంలో ప్రజలు అసెంబ్లీలోకి అడుగు పెట్టనివ్వరని మల్లాది విష్ణు స్పష్టం చేశారు.