-మహిళా స్వయం సహాయక సంఘాలు నాణ్యమైన ఆహార ఉత్పత్తుల తయారీపై దృష్టి సారించాలి
-ఆహార తయారీ నుంచి ప్యాకేజింగ్, మార్కెటింగ్ వరకు పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి
-మహిళలకు ఉపాధి, స్వయం ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు శిక్షణా కార్యక్రమాలు
-జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ
గుంటుపల్లి, నేటి పత్రిక ప్రజావార్త:
మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు ఆహార ఉత్పత్తుల తయారీలో నాణ్యత, భద్రత, పరిశుభ్రత ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ సూచించారు. ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లి గ్రామంలోని రైజ్ కేంద్రం ఆధ్వర్యంలో శనివారం ఆహార భద్రత, పరిశుభ్రత అంశాలపై నిర్వహించిన ప్రత్యేక అవగాహన వర్క్‌షాప్‌లో కలెక్టర్ ఈ సూచనలు చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మహిళా సంఘాల సభ్యులు తయారు చేసే ఆహార ఉత్పత్తులు నాణ్యతతో పాటు వినియోగదారులకు పూర్తి భద్రత కల్పించే విధంగా ఉండాలన్నారు. పరిశుభ్రమైన వాతావరణంలో ఆహార పదార్థాలను తయారు చేయడం ద్వారా వినియోగదారుల విశ్వాసాన్ని పొందవచ్చని తెలిపారు. ఆహార ఉత్పత్తుల తయారీ, ప్యాకేజింగ్, మార్కెటింగ్ రంగాల్లో అవసరమైన నైపుణ్యాలను పెంపొందించుకుని మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలని ఆకాంక్షించారు.
వర్క్‌షాప్‌లో ఫుడ్ సేఫ్టీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులు లాస్య, జయలలిత మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఆహార భద్రత, పరిశుభ్రత ప్రమాణాలపై సమగ్ర అవగాహన కల్పించారు. ఆహార పదార్థాల తయారీలో వ్యక్తిగత పరిశుభ్రత, వంటగది పరిసరాల శుభ్రత, నాణ్యమైన ముడి సరుకుల ఎంపిక, శుభ్రమైన నీటి వినియోగం, ఆహార పదార్థాల నిల్వ, ప్యాకేజింగ్ వంటి అంశాలను వివరించారు. ఆహార తయారీ నుంచి వినియోగదారులకు చేరే వరకు ప్రతి దశలోనూ పరిశుభ్రత ప్రమాణాలను పాటించాల్సిన ఆవశ్యకతను తెలియజేశారు.
జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఏ ఎన్ వి నాంచారరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మహిళా సంఘాల సభ్యులకు ఆహార ఉత్పత్తుల తయారీలో అనుసరించాల్సిన ఆధునిక పద్ధతులు, నాణ్యతా ప్రమాణాలపై ప్రాయోగిక అవగాహన కల్పించారు. రైజ్ కేంద్రం ద్వారా మహిళల్లో నైపుణ్యాభివృద్ధి పెంపొందించడంతో పాటు ఉపాధి, స్వయం ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు ఇటువంటి శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
