ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌లో పీవో, ఏపీవోల పాత్ర కీల‌కం

– ఎస్ఈసీ నిర్దేశించిన ప్ర‌మాణాల‌తో విధులు నిర్వ‌ర్తించాలి
– శిక్ష‌ణ కార్య‌క్ర‌మాల‌ను స‌ద్వినియోగం చేసుకోవాలి
– పీవో, ఏపీవోల శిక్ష‌ణ కార్య‌క్ర‌మంలో జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త:
ఎన్నికల ప్రక్రియను సజావుగా, పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించడంలో ప్రిసైడింగ్ అధికారులు (పీవోలు), అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు (ఏపీవోలు) కీలక పాత్ర పోషిస్తారని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ పేర్కొన్నారు.
స్థానిక సంస్థ‌ల రెండో సాధార‌ణ ఎన్నిక‌ల సిబ్బంది శిక్ష‌ణ‌లో భాగంగా బుధ‌వారం తుమ్మ‌ల‌ప‌ల్లివారి క్షేత్ర‌య్య క‌ళాక్షేత్రంలో వీఎంసీ ఎన్నిక‌ల పీవో, ఏపీవోల‌కు శిక్ష‌ణ కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మాన్ని ప‌రిశీలించి క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) నిర్దేశించిన నిబంధనలు, మార్గదర్శకాలకు అనుగుణంగా ఎన్నికల విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించాలని సూచించారు. పోలింగ్‌కు ముందు, పోలింగ్ స‌మ‌యంలో, ఆ త‌ర్వాత నిర్వ‌ర్తించాల్సిన విధుల్లోని ప్రతి అంశంపై అధికారులు పూర్తి అవగాహన కలిగి ఉండాలని, శిక్షణలో వివరించిన విధివిధానాలపై క్షుణ్ణంగా అవ‌గాహ‌న ఏర్ప‌రుచుకోవాల‌న్నారు. ఎన్నికల సమయంలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని స్ప‌ష్టం చేశారు. శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని సందేహాలను నివృత్తి చేసుకోవాలని, ఎన్నికల ప్రక్రియలో తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. పోలింగ్ బృందం స‌భ్యుల మ‌ధ్య ప‌టిష్ట స‌మ‌న్వ‌యం ద్వారా ప్ర‌క్రియ‌ను విజ‌య‌వంతంగా ముగించ‌వ‌చ్చ‌ని పేర్కొన్నారు. శిక్ష‌ణ‌లో భాగంగా బ్యాలెట్ బాక్సు, బ్యాలెట్ పేప‌ర్‌, పోలింగ్ మెటీరియ‌ల్‌, ఓటింగ్ ప్ర‌క్రియ‌, స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎన్నిక‌ల చ‌ట్టాల అమ‌లుతో పాటు నిర్వ‌హించాల్సిన రిజిస్ట‌ర్లు, అందించాల్సిన నివేదిక‌ల‌పైనా ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జంటేష‌న్ ద్వారా అవ‌గాహ‌న క‌ల్పించారు. ఉద‌యం ఏడు గంట‌ల నుంచి పోలింగ్ ముగిసే వ‌ర‌కు తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల‌పై క్షుణ్నంగా వివ‌రించారు. శిక్ష‌ణ కార్య‌క్ర‌మంలో వీఎంసీ అడిష‌న‌ల్ క‌మిష‌న‌ర్ డా. డి.చంద్ర‌శేఖ‌ర్‌, శిక్ష‌ణ కార్య‌క్ర‌మాల నోడ‌ల్ అధికారి డా. డి. హ‌రీష్ త‌దిత‌రులు పాల్గొన్నారు.