స్థానిక సంస్థల ఎన్నికలకు భారీ పోలీస్ బందోబస్తు..

-46,350 మంది సిబ్బందితో పటిష్ట భద్రతా ఏర్పాట్లు
-23 పట్టణ స్థానిక సంస్థలు, గ్రామ పంచాయతీ తొలి విడత ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రత్యేక కార్యాచరణ
-ఎన్నికల సమయంలో శాంతిభద్రతల పరిరక్షణకు అన్ని చర్యలు చేపట్టాం
-ఐజి, కోఆర్డినేషన్ (రాష్ట్ర ఎన్నికల సంఘం) బి. రాజకుమారి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
ఈ నెల 26వ తేదీన జరగనున్న 23 పట్టణ స్థానిక సంస్థల (ULBs), గ్రామ పంచాయతీ తొలి విడత ఎన్నికలను స్వేచ్ఛగా, ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేపట్టినట్లు ఐజీ, కోఆర్డినేషన్ (రాష్ట్ర ఎన్నికల సంఘం) బి. రాజకుమారి తెలిపారు.

ఎన్నికల నిర్వహణలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు భద్రతా చర్యలు చేపట్టామని, ఇందుకోసం మొత్తం 46,350 మంది పోలీస్ సిబ్బందిని బందోబస్తు విధులకు కేటాయించినట్లు వెల్లడించారు.

వీరిలో 23 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల బందోబస్తు కోసం 16,701 మంది సిబ్బందిని, గ్రామ పంచాయతీ తొలి విడత ఎన్నికల కోసం 29,649 మంది సిబ్బందిని కేటాయించినట్లు తెలిపారు.

జిల్లాల్లో అందుబాటులో ఉన్న పోలీస్ బలగాలతోపాటు 127 ప్లాటూన్ల ఏపీఎస్పీ ప్రత్యేక బలగాలతో పాటు, రైల్వే, ఈగల్, ఇతర విభాగాలకు చెందిన బలగాలను కూడా ఎన్నికల బందోబస్తు కోసం వినియోగిస్తున్నట్లు పేర్కొన్నారు.

జిల్లాల్లో అందుబాటులో ఉన్న బలగాల్లో 43 మంది ఎస్పీలు, 76 మంది అదనపు ఎస్పీలు, 179 మంది డీఎస్పీలు, 853 మంది సీఐలు/ఆర్‌ఐలు, 1832 మంది ఎస్‌ఐలు/ఆర్‌ఎస్‌ఐలు, 3, 601 మంది ఏఎస్‌ఐలు/ఏఆర్‌ఎస్‌ఐలు, 5,869 మంది సివిల్ హెడ్ కానిస్టేబుళ్లు/ఏఆర్ హెడ్ కానిస్టేబుళ్లు, 21, 252 మంది సివిల్ పోలీస్ కానిస్టేబుళ్లు/ఏఆర్‌పీసీలు, 7,957 మంది హోంగార్డులు, ఏపీఎస్పీ ఇతర విభాగాల సిబ్బంది 4,688 మంది
ఉన్నట్లు వివరించారు.

దీనికి అదనంగా ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు డ్రోన్స్, బాడీ ఓన్ కెమెరాలు, సీసీ టీవీ కెమెరాలు,
వీడియోగ్రఫీ తో నిఘా ఏర్పాటు చేసినట్టు తెలిపారు.

ఎన్నికల సమయంలో సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడంతో పాటు, పోలింగ్ కేంద్రాల వద్ద తగిన పోలీస్ బందోబస్తు, స్ట్రైకింగ్, స్పెషల్ స్ట్రైకింగ్ మరియు ఫ్లయింగ్ స్క్వాడ్ తో నిరంతర పెట్రోలింగ్, సున్నితమైన ప్రాంతాల్లో ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టిన్నట్లు తెలిపారు.

ఎన్నికల నియమావళిని ఉల్లంఘించే వారిపై, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఎన్నికల ప్రశాంత నిర్వహణకు పోలీస్ శాఖకు సహకరించాలని ఐజీ, కోఆర్డినేషన్ (రాష్ట్ర ఎన్నికల సంఘం)
బి. రాజకుమారి విజ్ఞప్తి చేశారు.