-నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు.. పునరావృతమైతే లైసెన్సుల రద్దు
-జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో పలు దరఖాస్తులకు ఆమోదం
-జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
ఎన్టీఆర్ జిల్లాలో గర్భస్థ లింగ నిర్ధారణ నిషేధ చట్టం (పీసీ & పీఎన్డీటీ), అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ (ఏఆర్టీ), సరోగసీ చట్టాలను అత్యంత కఠినంగా, పారదర్శకంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ అధికారులను ఆదేశించారు.
మంగళవారం విజయవాడ కలెక్టరేట్లోని ఏవీఎస్ రెడ్డి సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి మల్టీ మెంబర్ అప్రోప్రియేట్ అథారిటీ, డిస్ట్రిక్ట్ అప్రోప్రియేట్ అథారిటీ కమిటీల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి 2వ అదనపు జిల్లా జడ్జి ఎం.సునీల్ కుమార్ హాజరయ్యారు.
సరోగసీ కోసం దరఖాస్తు చేసుకున్న దంపతులు, సరోగేట్ తల్లులకు చికిత్స విజయావకాశాలు, వైద్యపరమైన ప్రమాదాలు, చట్టపరమైన నిబంధనలపై సంబంధిత క్లినిక్‌లు, వైద్యులు సమగ్ర కౌన్సెలింగ్ అందించేలా జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి, తనిఖీ బృందం పర్యవేక్షించాలని కలెక్టర్ సూచించారు. సరోగసీ దరఖాస్తుల్లో వైద్యపరమైన కారణాలను స్పష్టంగా నమోదు చేయడాన్ని కమిటీ అభినందించింది. భవిష్యత్తులోనూ ఇదే పారదర్శకతను కొనసాగించాలని ఆదేశించింది. ఏఆర్టీ, సరోగసీ క్లినిక్‌లపై వచ్చిన ఫిర్యాదులు వాస్తవమని తేలితే మొదటిసారి ఉల్లంఘనకు జరిమానా, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, ఉల్లంఘనలు పునరావృతమైతే సంబంధిత కేంద్రాల రిజిస్ట్రేషన్ లేదా లైసెన్సులను రద్దు చేయాలని కమిటీ స్పష్టం చేసింది. చట్టవిరుద్ధమైన గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షలపై జీరో టాలరెన్స్ విధానాన్ని అమలు చేయాలని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో నమోదైన అన్ని స్కానింగ్ కేంద్రాల్లో రిసెప్షన్, వెయిటింగ్ ఏరియా, అల్ట్రాసౌండ్ గదుల్లో అవగాహన బోర్డులు తప్పనిసరిగా ప్రదర్శించాలి. రేడియాలజిస్ట్, గైనకాలజిస్ట్, సోనాలజిస్ట్, కార్డియాలజిస్ట్‌ల విద్యార్హత ధ్రువీకరణ పత్రాలను ప్రదర్శించడంతో పాటు ఫారం-ఎఫ్, ఇతర చట్టపరమైన రికార్డులను సకాలంలో సమర్పించాలి. కొత్త రిజిస్ట్రేషన్, రెన్యువల్, సర్టిఫికెట్లలో మార్పుల కోసం వచ్చే దరఖాస్తులను పరిశీలించడంతో పాటు, కేంద్రాల్లో మౌలిక వసతులు, లిఫ్ట్ సౌకర్యం, చట్టపరమైన అనుమతులపై నిరంతర భౌతిక తనిఖీలు నిర్వహించాలని కమిటీ ఆదేశించింది. సమావేశంలో వివిధ దరఖాస్తులను పరిశీలించి కమిటీ ఆమోదం తెలిపింది. సరోగసీ ప్రక్రియకు సంబంధించి 2 దరఖాస్తులు, కొత్త స్కానింగ్ కేంద్రాల రిజిస్ట్రేషన్‌కు 7 దరఖాస్తులు,
రిజిస్ట్రేషన్ రెన్యువల్‌కు 28 దరఖాస్తులు, నమోదైన సర్టిఫికెట్లలో మార్పులకు 18 దరఖాస్తులు, రిజిస్ట్రేషన్ రద్దుకు 1 దరఖాస్తు కమిటీ ఆమోదం తెలిపింది.
ఈ సమావేశంలో డీఎం&హెచ్ఓ డాక్టర్ శ్రావణ్ బాబు, 2వ అదనపు జిల్లా జడ్జి ఎం.సునీల్ కుమార్, విజయవాడ ఆర్డీవో వెన్నెల శ్రీను, వాసవ్య మహిళా మండలి ప్రతినిధి రోషిని, ప్రముఖ వైద్య నిపుణులు, ఐఎస్‌ఏఆర్ ఏపీ చాప్టర్ అధ్యక్షులు డాక్టర్ వి.పద్మజ, ఏఎస్ఐ కె.నాగిని, డీపీఎంఓ డాక్టర్ పి.నవీన్, లీగల్ కన్సల్టెంట్ ఎస్.వాణి, తనిఖీ బృందం వైద్యాధికారి డాక్టర్ విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు.
