అర్హులైన ప్రతిఒక్కరికీ ఓట‌ర్ల జాబితాలో చోటు

– అత్యంత పార‌ద‌ర్శ‌కంగా స‌ర్ ప్ర‌క్రియ‌
– ఏఎస్‌డీడీ ఓట‌ర్ల‌కు స‌ర్‌లో మ‌రో అవ‌కాశం
– న‌వంబ‌ర్ 30 వ‌ర‌కు ఎన్యూమ‌రేష‌న్ ఫారాల పంపిణీ, స్వీక‌ర‌ణ‌
– డిసెంబ‌ర్ 22న తుది జాబితా ప్ర‌చుర‌ణ‌
– జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక స‌మ‌గ్ర సవరణ (స‌ర్‌) ప్ర‌క్రియ అత్యంత పార‌ద‌ర్శ‌కంగా జ‌రుగుతోంద‌ని.. ఈ ప్ర‌క్రియ‌లో భాగంగా గైర్హాజరు (ఆబ్సెంట్), నివాసం మారినవారు (షిఫ్టెడ్‌), మరణించినవారు (డెడ్‌), ఒకటికంటే ఎక్కువ చోట్ల పేర్లు ఉన్నవారు (డూప్లికేట్‌) కారణాలతో గుర్తించిన ఏఎస్‌డీడీ ఓట‌ర్ల‌కు ఈసీఐ మార్గదర్శకాల ప్రకారం మ‌రో అవ‌కాశం క‌ల్పించేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ తెలిపారు.
రాష్ట్ర చీఫ్ ఎల‌క్టోర‌ల్ అధికారి (సీఈవో) వివేక్ యాదవ్.. అద‌న‌పు సీఈవో ఎస్‌.డిల్లీరావుతో క‌లిసి సోమవారం జిల్లా కలెక్టర్ల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. ఈ వీసీకి జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ అధికారుల‌తో క‌లిసి క‌లెక్ట‌రేట్ ఏవీఎస్ రెడ్డి హాల్ నుంచి హాజ‌ర‌య్యారు. స‌ర్ స‌వ‌రించిన షెడ్యూల్‌కు అనుగుణంగా తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌తో పాటు కృష్ణా-గుంటూరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజ‌క‌వ‌ర్గానికి సంబంధించి ఓట‌ర్ల జాబితాపై సీఈవో స‌మీక్షించి సూచ‌న‌లు చేశారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 1,23,814 మంది ఏఎస్‌డీడీ ఓట‌ర్లు ఉన్నార‌ని.. వీరందరికీ సంబంధించిన ఎన్యూమ‌రేష‌న్ ఫారాలను డౌన్‌లోడ్ చేసి, పంపిణీ చేయ‌డం జ‌రుగుతుంద‌న్నారు. సవరించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 30వ తేదీ వరకు ఈఎఫ్‌ల‌ను పంపిణీ చేసి, స్వీక‌రించ‌డం జ‌రుగుతుంద‌న్నారు. స్వీకరించిన ఫారాలను డిసెంబర్ 10వ తేదీలోగా పరిశీలించి, విచారణ అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కొత్తగా ఓటరుగా నమోదు చేసుకునేందుకు అందిన దరఖాస్తులను డిసెంబర్ 15వ తేదీలోగా విచారించి పరిష్కరిస్తామని తెలిపారు. 2026, డిసెంబర్ 22వ తేదీన స‌ర్ తుది జాబితాను ప్రచురించనున్నట్లు వెల్లడించారు. కృష్ణా–గుంటూరు ఉపాధ్యాయ నియోజకవర్గ ఓటర్ల జాబితా తయారీకి సంబంధించి ఇప్పటివరకు మొత్తం 2,599 దరఖాస్తులు అందాయని జిల్లా కలెక్టర్ తెలిపారు. వీటిలో 1,389 దరఖాస్తులను ఇప్పటికే పరిష్కరించగా, మరో 1,210 దరఖాస్తులు విచారణ దశలో ఉన్నాయని వివరించారు. డిసెంబ‌ర్ 23న ముసాయిదా జాబితా ప్ర‌చుర‌ణ అనంత‌రం ఆ రోజు నుంచి జ‌న‌వ‌రి 12వ తేదీ వ‌ర‌కు క్లెయిమ్‌లు, అబ్జెక్ష‌న్ల దాఖ‌లుకు అవ‌కాశం ఉంటుంద‌ని, వాటిని ప‌రిష్క‌రించిన అనంత‌రం 2027, ఫిబ్ర‌వ‌రి 2న తుది జాబితాను ప్ర‌చురించ‌డం జ‌రుగుతుంద‌ని.. ఇందుకు త‌గిన చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు తెలిపారు. స‌మావేశంలో డీఆర్‌వో ఎం.ల‌క్ష్మీన‌ర‌సింహం త‌దిత‌రులు పాల్గొన్నారు.