-సరఫరా జాప్యాన్ని నివారించేందుకు ప్రస్తుత మూడు నెలల విధానంలో భారీ మార్పు
-గత ప్రభుత్వ తప్పుడు విధానాల అనుభవంతో మార్పునకు ఆదేశించిన మంత్రి సత్యకుమార్ యాదవ్
-గత లోపాలను ఎత్తి చూపిన సిఏజీ రిపోర్టు ఆధారంగా నూతన విధానం తయారీ
-కేవలం 1.50 శాతం మందులనే పూర్తిగా సరఫరా చేసిన గత ప్రభుత్వం
-జగన్ ప్రభుత్వ విధానాలపై ధ్వజమెత్తిన మంత్రి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
వివిధ స్థాయిల్లోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల మందులు, సర్జికల్స్ అవసరాలు, వీటి సరఫరాలో జాప్యాన్ని నివారించేందుకు వీటి కొనుగోలు విధానంలో వైద్యారోగ్య శాఖ పెను మార్పునకు శ్రీకారం చుట్టింది. గత ప్రభుత్వ హయాంలో వీటి కొనుగోలు విషయంలో లోపాలు, వాటి దుష్పరిణామాలపై సిఏజీ (కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా) సమగ్ర నివేదిక ఆధారంగా వైద్యారోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశం మేరకు కొనుగోలు విధానంలో మార్పునకు ఆదేశించారు.
మందుల కొనుగోలుకు సంబంధించిన పలు విషయాలపై 24-7-2026న జరిగిన సమీక్షా సమావేశంలో మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ ప్రస్తుతం మూడు నెలల అవసరాలకు మాత్రమే మందుల కొనుగోలు చేస్తున్న విధానానికి భిన్నంగా ఆరు నెలల డిమాండ్‌కు అనుగుణంగా కొనుగోలు చేయాలని ఆదేశించారు. ఇందుకనుగుణంగా వచ్చే ఏడాది జనవరి-జూన్ కాలానికి అవసరమైన మందులు, సర్జికల్స్ కొనుగోలు ప్రక్రియను ఈ నెల 10న ఏపీఎంయస్ ఐడిసి ప్రారంభించింది. గతానికి భిన్నంగా అవసరాల మేరకు ముందస్తుగానే జరిగే ఈ కొనుగోలు ప్రక్రియను మొదటిసారిగా చేపట్టారు. ఇందుకు సంబంధించిన వ్యయం అంచనా సుమారు రూ.275 కోట్లు. ఈ కొనుగోలు ప్రక్రియ డిసెంబరు నాటికి పూర్తి చేయాలని మంత్రి స్పష్టం చేశారు.
మందుల నూతన కొనుగోలు విధానం
మందుల కొనుగోలుకు సంబంధించి జగన్ ప్రభుత్వ నిర్వాకాలపై సిఏజీ నివేదిక ఆధారంగా సమగ్ర నూతన విధానాన్ని రూపొందించాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ సమీక్షా సమావేశంలో ఆదేశించిన మేరకు మంత్రిత్వ శాఖ నూతన విధాన రూపకల్పన ప్రక్రియ చేపట్టింది. ఇందుకోసం 2018-22 కాలంలో మందుల కొనుగోలుపై సిఏజీ నివేదికను లోతుగా పరిశీలించారు. మందులు, సర్జికల్స్ సరఫరా విషయంలో గత ప్రభుత్వ వైఫల్యాలపై మంత్రి ధ్వజమెత్తారు. గురివింద గింజ సామెతన మాజీ సీఎం ప్రస్తుత కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడాన్ని మంత్రి దుయ్యబట్టారు. గత ప్రభుత్వం ఆసుపత్రులకు అవసరమైన 600 కి పైగా మందులలో కేవలం 1.50 శాతం మందులనే మాత్రమే అవసరాలకు మేర సరఫరా చేసినట్లు సిఏజీ వెల్లడించింది.
జగన్ ప్రభుత్వ మందుల కొనుగోలుపై సిఏజీ వెల్లడించిన లోపాలు:
1) ఆసుపత్రుల అవసరాల మేరకు కాకుండా గత ప్రభుత్వం ఇష్టానుసారంగా మందుల్ని కొనుగోలు చేసింది.
2) స్థానిక అవసరాల మేరకు అత్యవసర మందుల కొనుగోలుకు ఆసుపత్రులకు నిధులు కేటాయించలేదు. దీని వలన రోగులకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి.
3) మందులు, సర్జికల్స్ కొనుగోలుకు బడ్జెట్‌లో కేటాయించిన నిధుల్లో రూ. 391 కోట్లు గత ప్రభుత్వ అలసత్వం వలన మురిగిపోయాయి.
4) వాస్తవ అవసరాల ఆధారంగా కాకుండా బడ్జెట్ లభ్యతను బట్టి ఆయా ఆసుపత్రులు మందుల కొనుగోలు వివరాలను సమర్పించడంతో అవసరాలు, సరఫరా మధ్య భారీ వ్యత్యాసం ఏర్పడింది.
5) గత ప్రభుత్వం 600 పైగా ఉన్న ఎసెన్షియల్ మరియు అడిషనల్ మెడిసిన్స్ లిస్ట్‌లో కేవలం 1.55 శాతం మాత్రం మందులనే పూర్తి అవసరాల మేరకు సరఫరా చేసింది. 6 శాతం మందులను అసలు సరఫరా చేయలేదు. మిగిలిన మందులను 69 నుండి 88 శాతం మాత్రమే సరఫరా చేసింది.
6) మొత్తం 372 సర్జికల్స్ సరఫరా విషయంలో కేవలం 1.05 శాతం అవసరాలను మాత్రమే గత ప్రభుత్వం పూర్తి స్థాయిలో సరఫరా చేసింది. 8 శాతానికి సంబంధించి ఎటువంటి సరఫరా జరగలేదు. తక్కిన వాటికి సంబంధించి 65 నుంచి 88 శాతం మాత్రమే సరఫరా జరిగింది.
7) గతంలో అనంతపురం జీజీహెచ్‌కు 45 నుంచి 66 మందులకు ఎటువంటి స్టాకులు పెట్టలేదు. ఈ సంఖ్య శ్రీకాకుళం జీజీహెచ్‌కు సంబంధించి 73 నుంచి 113 వరకు ఉండగా, నెల్లూరు జీజీహెచ్ విషయంలో 32 నుంచి 60 మందులకు స్టాకులు నిర్వహించలేదు. ఈ విషయాన్ని గత ప్రభుత్వం అంగీకరించి, మున్ముందు తగు చర్యల్ని తీసుకుంటామంటూ హామీ ఇచ్చిందని సిఏజీ వెల్లడించింది.
8) వైద్య పరికరాలకు సంబంధించి ఎటువంటి ప్రణాళికాబద్ధమైన అంచనా లేకపోవడంతో పలు పరికరాలు నిరుపయోగంగా ఉండిపోయాయి.
9) నిర్ధిష్ట కాలానికి రేట్ కాంట్రాక్ట్ పద్ధతిలో వైద్య పరికరాల కొనుగోలు చేయాలన్న విధానానికి భిన్నంగా గత ప్రభుత్వం ఇష్టానుసారంగా టెండర్ల ద్వారా కొనుగోలు చేసింది. ఈ విషయాన్ని గత ప్రభుత్వం అంగీకరించిందని సిఏజీ తెలిపింది.
ఈ లోపాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన మంత్రి సత్యకుమార్ యాదవ్ ఇవి పునరావృతం కాకుండా పటిష్టమైన, సమగ్రమైన కొనుగోలు విధానాన్ని త్వరలో రూపొందించాలని ఆదేశించారు. ప్రస్తుతానికి భిన్నంగా ఆరు నెలల అవసరాల కొనుగోలు సవ్యంగా జరిగేందుకు అవసరమైన చర్యలన్నింటినీ చేపట్టాలని మంత్రి సూచించారు.
