అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
ముంబైలో ఈ నెల 25, 26 తేదీల్లో జరగనున్న ప్రతిష్టాత్మక ‘3వ వరల్డ్ మేయర్స్ ఫోరం’ అంతర్జాతీయ సదస్సుకు స్వచ్ఛ ఆంధ్ర కార్పోరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్కు ఆహ్వానం అందింది. ఈ సదస్సులో పాల్గొనేందుకు ఆయన మంగళవారం రాత్రి బయలుదేరు ముంబై వెళతారు.
ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ (ఏఐఐఎల్ఎస్జీ) శతాబ్ది ఉత్సవాలలో భాగంగా, బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ సహకారంతో వరల్డ్ మేయర్స్ ఫోరమ్ ఆధ్వర్యంలో ఈ అంతర్జాతీయ సదస్సు నిర్వహిస్తున్నారు. ముంబైలోని ఫెయిర్మాంట్ హోటల్ (ఇన్ఫినిటీ బాల్రూమ్ / గ్రాండ్ టెర్మినస్) వేదికగా ఈ రెండు రోజుల సదస్సు జరగనుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సుమారు 30 దేశాల నుండి 200కు పైగా నగరాలకు చెందిన మేయర్లు, మున్సిపల్ కమిషనర్లు, విధాన రూపకర్తలతో సహా 500 మందికి పైగా ప్రతినిధులు పాల్గొంటున్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాల పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు, స్థానిక ప్రభుత్వ ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొని భవిష్యత్ నగరాల అభివృద్ధిపై చర్చిస్తారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. సదస్సులో మొదటి రోజు ప్రారంభ సమావేశం అనంతరం ‘భారతదేశం 2047 కోసం ప్రణాళిక – 2047 నాటికి నగరాలను పునర్నిర్మించడం’, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత భవిష్యత్ నగరాల నిర్వహణ, పట్టణ వ్యర్థాల సమస్య పరిష్కారం, సర్క్యులర్ సిటీస్ , ప్రపంచ పెట్టుబడుల ద్వారా స్థానిక అభివృద్ధి వంటి కీలక అంశాలపై సాంకేతిక సమావేశాలు జరగనున్నాయి.
ఈ సమావేశాల్లో బుధవారం సాయంత్రం సర్క్యులర్ సిటీస్ అనే అంశంపై స్వచ్ఛ ఆంధ్ర కార్పోరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ప్రసంగిస్తారు. 26వ తేది రెండవ రోజు నగరాలను మరింత సురక్షితంగా మార్చడం, నదీ నగరాల అభివృద్ధి, ప్రజల ప్రయాణానికి ప్రాధాన్యతనిచ్చే పట్టణ రవాణా వ్యవస్థ, నెట్-జీరో మౌలిక సదుపాయాలు, వాతావరణ సంక్షోభం ఎదుర్కోవడం, మెట్రోపాలిటన్ పాలన బలోపేతం, క్రీడా దౌత్యం ద్వారా ఆరోగ్యకరమైన నగరాల నిర్మాణం వంటి అంశాలపై చర్చించి ముగింపు సమావేశం నిర్వహించనున్నారు. ఈ అంతర్జాతీయ వేదికపై మన రాష్ట్ర అభివృద్ధి నమూనాను వివరించడంతో పాటు, ఇతర ప్రపంచ నగరాల అత్యుత్తమ విధానాలను అధ్యయనం చేసేందుకు ఈ సదస్సు ఎంతో దోహదపడనుంది.
