-17వ డివిజన్లో ఎమ్మెల్సీ సోము వీర్రాజుతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించిన దేవినేని ఉమా
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త:
రాజమహేంద్రవరం నగరాన్ని మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలంటే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజమండ్రి రూరల్ 17వ డివిజన్లో ఎమ్మెల్సీ సోము వీర్రాజు గారు, కూటమి నాయకులతో కలిసి దేవినేని ఉమా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ అభ్యర్థి రేలంగి రాణి శ్రీదేవి, 17వ డివిజన్ కూటమి అభ్యర్థి కందుకూరి మనోజ్ బాబులను గెలిపించాలని ఇంటింటికీ వెళ్లి ప్రజలను అభ్యర్థించారు.
కూటమి ప్రభుత్వం నగరాల సమగ్ర అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ పనిచేస్తోందని, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. పారిశుధ్య నిర్వహణ, సురక్షిత తాగునీటి సరఫరా, మెరుగైన రహదారులు, సమర్థవంతమైన డ్రైనేజీ వ్యవస్థ వంటి మౌలిక వసతులను అభివృద్ధి చేయడానికి కూటమి అభ్యర్థుల విజయంతో మరింత అవకాశం కలుగుతుందని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమం నిరంతరం కొనసాగాలంటే కూటమికి ప్రజల మద్దతు అవసరమని రాజమండ్రి నగర భవిష్యత్తు కోసం కూటమి అభ్యర్థులను గెలిపించాలని దేవినేని ఉమా ప్రజలకు పిలుపునిచ్చారు.
