డిసెంబ‌ర్ 22న స‌ర్ తుది జాబితా ప్ర‌చుర‌ణ‌

– 1,23,714 మంది ఏఎస్‌డీడీ ఓట‌ర్ల‌కు మ‌రో అవ‌కాశం
– స‌ద్వినియోగం చేసుకోవ‌డంలో రాజకీయ ప‌క్షాలు స‌హ‌క‌రించాలి
– ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓట‌ర్ల జాబితాపైనా ప్ర‌త్యేకంగా దృష్టిపెట్టాం
– డిసెంబ‌ర్ 23 నుంచి జ‌న‌వ‌రి 12 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తులు, అభ్యంత‌రాల స్వీక‌ర‌ణ‌
– రాజ‌కీయ పార్టీల ప్ర‌తినిధుల స‌మావేశంలో జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక స‌మ‌గ్ర సవరణ (స‌ర్‌) ప్ర‌క్రియలో భాగంగా స‌వ‌రించిన షెడ్యూలు ప్ర‌కారం 1,23,714 మంది ఏఎస్‌డీడీ ఓట‌ర్ల‌కు మ‌రో అవ‌కాశం క‌ల్పిస్తూ ఎన్యూమ‌రేష‌న్ ఫారాలు (ఈఎఫ్‌) పంపిణీ చేసి, స్వీక‌రించి ప‌రిశీలించ‌డం జ‌రుగుతుంద‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ తెలిపారు. ఈసీఐ క‌ల్పించిన మ‌రో అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోవ‌డంలో రాజ‌కీయ ప‌క్షాలు స‌హ‌క‌రించాల‌ని కోరారు. డిసెంబర్ 22వ తేదీన స‌ర్ తుది జాబితాను ప్రచురించనున్నట్లు వెల్లడించారు.
మంగ‌ళ‌వారం క‌లెక్ట‌రేట్ శ్రీ ఏవీఎస్ రెడ్డి హాల్‌లో క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ అధ్య‌క్ష‌త‌న రాజ‌కీయ పార్టీల ప్ర‌తినిధుల స‌మావేశం జ‌రిగింది. ఈ స‌మావేశంలో క‌లెక్ట‌ర్ ఇప్ప‌టివ‌ర‌కు జ‌రిగిన స్థానిక ఎన్నిక‌ల్లో రాజ‌కీయ పార్టీల కీల‌క భాగ‌స్వామ్యాన్ని ప్ర‌శంసించ‌డంతో పాటు స‌ర్ స‌వ‌రించిన షెడ్యూలు ప్ర‌కారం తీసుకుంటున్న చ‌ర్య‌లు, కృష్ణా–గుంటూరు ఉపాధ్యాయ నియోజకవర్గ ఓటర్ల జాబితా రూప‌క‌ల్ప‌న‌కు సంబంధించిన అంశాల‌ను వివ‌రించారు. స‌ర్ ప్ర‌క్రియ‌లో
ఈ నెల 30వ తేదీ వరకు ఈఎఫ్‌ల‌ను పంపిణీ చేసి, స్వీక‌రించ‌డం జ‌రుగుతుంద‌న్నారు. స్వీకరించిన ఫారాలను డిసెంబర్ 10వ తేదీలోగా పరిశీలించి, విచారణ అనంతరం తదుపరి చర్యలు తీసుకొని తుది జాబితాను ప్ర‌చురించ‌నున్న‌ట్లు పేర్కొన్నారు.
దోష‌ర‌హితంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓట‌ర్ల జాబితా:
కృష్ణా-గుంటూరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి దోష ర‌హిత ఓట‌ర్ల జాబితా ప్ర‌చుర‌ణ‌కు ప్ర‌ణాళికాయుత కృషిచేస్తున్నామ‌ని క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ తెలిపారు. డిసెంబ‌ర్ 23న ముసాయిదా జాబితా ప్ర‌చురించిన అనంత‌రం ఆ రోజు నుంచి జ‌న‌వ‌రి 12 వ‌ర‌కు ఓట‌రు న‌మోదు ద‌ర‌ఖాస్తులు, అభ్యంత‌రాలు స్వీక‌రించ‌నున్న‌ట్లు తెలిపారు. వాటిని ప‌రిష్క‌రించిన అనంత‌రం 2027, ఫిబ్ర‌వ‌రి 2న తుది జాబితాను ప్ర‌చురించ‌డం జ‌రుగుతుంద‌న్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓట‌ర్ల జాబితాలో పేరు న‌మోదుకు అర్హ‌త‌ల‌ను క‌లెక్ట‌ర్ వివ‌రించారు. సంబంధిత ఉపాధ్యాయ నియోజకవర్గ పరిధిలో సాధారణంగా నివసిస్తూ ఉండాల‌ని అదే విధంగా అర్హత తేదీ (2026, న‌వంబ‌ర్ 1)కి ముందు ఆరేళ్ల కాలంలో మొత్తం కనీసం మూడేళ్లు ఉపాధ్యాయ వృత్తిలో పనిచేసి ఉండాల‌న్నారు.
సంబంధిత ఆరు సంవత్సరాల కాలంలో ఒకటి కంటే ఎక్కువ విద్యాసంస్థల్లో పనిచేసిన అభ్యర్థులు, ఆయా విద్యాసంస్థల ప్రధానోపాధ్యాయుల నుంచి సేవా ధ్రువీకరణ పత్రాలు పొందాల‌న్నారు. గుర్తింపు పొందిన మాధ్యమిక పాఠశాల స్థాయి కంటే తక్కువ కాని విద్యాసంస్థలో బోధించి ఉండాలని వివ‌రించారు. ఫుల్‌టైమ్‌, అడ‌హాక్ ఉపాధ్యాయులు అర్హుల‌ని.. పార్ట్‌టైమ్, బోధనేతర సిబ్బంది అర్హులు కారన్నారు. ప్ర‌భుత్వ గుర్తింపు పొందిన, నోటిఫై చేసిన ప్రైవేటు విద్యాసంస్థల్లో పనిచేసే అర్హులైన ఉపాధ్యాయులను కూడా నిర్దేశిత ధ్రువీకరణ, సంబంధిత జిల్లా అధికారుల కౌంటర్ సంతకం ప్రక్రియకు లోబడి ఓటర్లుగా నమోదు చేయవచ్చ‌న్నారు. ఆన్లైన్ లేదా ఫారం-19 ద్వారా దరఖాస్తు చేసుకోవ‌చ్చ‌ని వివ‌రించారు. ఏవైనా సందేహాలున్నా లేదా స‌మాచారానికి క‌లెక్ట‌రేట్ క‌మాండ్ కంట్రోల్ కేంద్రం (91549 70454) అందుబాటులో ఉంద‌ని క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ తెలిపారు.
స‌మావేశంలో డీఆర్‌వో ఎం.ల‌క్ష్మీన‌ర‌సింహం, డీవీ కృష్ణ (సీపీఐ-ఎం), బి.ముర‌ళీకృష్ణ (ఐఎన్‌సీ), రామ‌య్య యేదుపాటి (తెదేపా), ర‌మేష్ రాజు (బీజేపీ) త‌దిత‌రులు పాల్గొన్నారు.