-అభ్యర్థుల ఎన్నికల వ్యయాలపై నిరంతర నిఘా ఉంచాలి
-చెల్లింపు వార్తలు, రాజకీయ ప్రకటనలను పర్యవేక్షించాలి
-ఎన్టీఆర్ జిల్లా వ్యయ పరిశీలకులు బి.విజయ కుమార్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
ఎన్టీఆర్ జిల్లాలో రెండవ దశ గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల వ్యయ పరిశీలకులు బి.విజయ కుమార్ మంగళవారం జూమ్ ద్వారా వ్యయ పర్యవేక్షణ బృందాలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. చందర్లపాడు, జగ్గయ్యపేట, కంచికచర్ల, నందిగామ, పెనుగంచిప్రోలు, వత్సవాయి, వీరులపాడు మండలాల సహాయ వ్యయ పరిశీలకులు, అకౌంటింగ్, ఎఫ్ ఎస్ టి., ఎస్ ఎస్ టి., బృందాల నాయకులు పాల్గొన్నారు. నవంబర్ 29న జిల్లాలోని 138 గ్రామ పంచాయతీలు, 1,432 వార్డులలో రెండవ దశ పోలింగ్ జరగనున్న నేపథ్యంలో అన్ని బృందాలు అప్రమత్తంగా విధులు నిర్వహించాలని పరిశీలకులు ఆదేశించారు. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం పోటీలో ఉన్న సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థులకు షాడో పరిశీలన రిజిస్టర్లు ప్రారంభించి, వారి ఎన్నికల వ్యయాలను నమోదు చేయాలి. అభ్యర్థులు ప్రతి మూడు రోజులకు ఒకసారి వోచర్లు, బిల్లులతో సహా వ్యయ వివరాలను సమర్పించాలి. లెక్కలు సమర్పించని అభ్యర్థులకు నోటీసులు జారీ చేయాలని సూచించారు. ఎఫ్ ఎస్ టి., ఎస్ ఎస్ టి., బృందాలు సభలు, ర్యాలీలు, వాహనాలు, హోర్డింగులు, పోస్టర్లు, బ్యానర్లు, ఆహారం తదితర ప్రచార ఖర్చులను నమోదు చేసి, ప్రతిరోజూ అకౌంటింగ్ బృందాలకు నివేదికలు పంపాలి. నగదు, మద్యం, కానుకలు లేదా ఇతర ప్రలోభాల పంపిణీ గుర్తించిన వెంటనే అధికారులకు తెలియజేయాలి. ప్రింట్, ఎలక్ట్రానిక్, కేబుల్, సోషల్ మీడియాలో ప్రచురితమయ్యే చెల్లింపు వార్తలు, స్పాన్సర్డ్ రాజకీయ ప్రకటనలపై ప్రత్యేక నిఘా ఉంచాలి. ఆధారాలతో సహా పరిశీలకులకు నివేదించాలి. సభలు, ర్యాలీలు, వాహనాలు, లౌడ్స్పీకర్లు తదితర ప్రచార కార్యక్రమాలకు సంబంధిత అధికారుల అనుమతులు తప్పనిసరిగా పొందాలి. అనుమతి లేని కార్యక్రమాలను వెంటనే నివేదించాలని ఆదేశించారు. సహాయ వ్యయ పరిశీలకులు తమ మండలాల్లోని బృందాల పనితీరును పర్యవేక్షిస్తూ, రిజిస్టర్లను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలి. అన్ని రిజిస్టర్లను ఎప్పటికప్పుడు నవీకరించి, తనిఖీలకు అందుబాటులో ఉంచాలి.
ఎన్నికల వ్యయ పర్యవేక్షణలో పారదర్శకత, సమన్వయంతో విధులు నిర్వహించాలని ఎన్నికల వ్యయ పరిశీలకులు ఆదేశించారు.
