పంచాయ‌తీ ఎన్నిక‌ల‌కు స‌మ‌న్వ‌యంతో స‌న్న‌ద్ధం..

– ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌లో ప్ర‌తిద‌శ‌లోనూ అప్ర‌మ‌త్తంగా ఉండాలి
– సున్నిత, అత్యంత సున్నిత పోలింగ్ కేంద్రాల్లో మైక్రో అబ్జర్వర్ల నియామకం
– సీసీ కెమెరాలు, వెబ్‌కాస్టింగ్ ద్వారా నిరంతర ప‌ర్య‌వేక్ష‌ణ‌
– అధికారుల‌తో జిల్లా కలెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ వీడియో కాన్ఫరెన్స్‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
జిల్లాలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ, ఎన్నికల ప్రక్రియలో ప్రతి దశలోనూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ఆదేశించారు.
పంచాయ‌తీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి మంగ‌ళ‌వారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా క‌లెక్ట‌ర్లు, సీపీలు, ఎస్‌పీల‌తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీసీకి జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌, ఎన్నిక‌ల వ్య‌య ప‌రిశీల‌కులు బి.విజ‌య‌కుమార్‌తో క‌లిసి క‌లెక్ట‌రేట్ నుంచి పాల్గొన్నారు. ఈ వీసీ అనంత‌రం పంచాయతీ ఎన్నికల నిర్వహణకు చేసిన ఏర్పాట్లు, భద్రతా చర్యలు, పోలింగ్ కేంద్రాల్లో సదుపాయాలు, ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాలు తదితర అంశాలపై క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ జిల్లా అధికారుల‌తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో తొలిద‌శ‌లో ఈ నెల 26న 73 గ్రామ పంచాయ‌తీల్లో 856 వార్డుల‌కు 1,001 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయ‌న్నారు. తొలిద‌శ‌లో విజ‌య‌వాడ రెవెన్యూ డివిజ‌న్‌కు సంబంధించి జి.కొండూరు మండ‌లంలో 22 గ్రామ పంచాయ‌తీల్లో 224 వార్డుల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయ‌న్నారు. ఇదేవిధంగా ఇబ్ర‌హీంప‌ట్నం మండ‌లంలో 10 గ్రామ పంచాయ‌తీల్లో 116 వార్డుల‌కు, మైల‌వ‌రం మండ‌లంలో 13 గ్రామ పంచాయ‌తీల్లో 154 వార్డుల‌కు, విజ‌య‌వాడ గ్రామీణ మండ‌లంలో 16 గ్రామ పంచాయ‌తీల్లో 226 వార్డుల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న‌ట్లు తెలిపారు. తిరువూరు రెవెన్యూ డివిజ‌న్ రెడ్డిగూడెం మండ‌లంలో 12 గ్రామ పంచాయ‌తీల్లో 136 వార్డుల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయ‌ని తెలిపారు. ఉద‌యం 7 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం ఒంటిగంట వ‌ర‌కు పోలింగ్ ఉంటుంద‌ని.. మ‌ధ్యాహ్నం రెండు గంట‌ల నుంచి కౌంటింగ్, ఫ‌లితాల వెల్ల‌డి జ‌రుగుతుంద‌న్నారు. ఇందుకు త‌గిన ఏర్పాట్ల‌తో సిద్ధంగా ఉండాల‌ని.. అప్పుడే ఎక్క‌డా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆసాంతం సాఫీగా జ‌రుగుతుంద‌న్నారు. సున్నిత, అత్యంత సున్నిత పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించేందుకు మైక్రో అబ్జర్వర్లను నియమించ‌డం జ‌రిగింద‌న్నారు. పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు, వెబ్‌కాస్టింగ్ ఏర్పాట్లు చేపట్టి నిరంతర పర్యవేక్షణ ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా భద్రతా చర్యల‌ను స‌మ‌న్వ‌యం చేసుకోవాల‌న్నారు. తొలిద‌శ ఎన్నిక‌ల‌కు ఏర్పాటు చేసిన అయిదు డిస్ట్రిబ్యూష‌న్ కేంద్రాల్లో త‌గిన ఏర్పాట్లు చేయాల‌ని క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ ఆదేశించారు.
ఎన్నికల సంఘం మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటిస్తూ, ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేసి ఎన్నికల ప్రక్రియను ప్రశాంతంగా, స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ ల‌క్ష్మీశ స్పష్టం చేశారు. స‌మావేశంలో డీఆర్‌వో ఎం.ల‌క్ష్మీన‌ర‌సింహం, డీపీవో టి.సీతామ‌హాల‌క్ష్మి త‌దిత‌రులు పాల్గొన్నారు.