వైద్యం నుంచి వ్యవసాయం వరకు ఏఐ వినియోగం

-డేటా ఆధారిత నిర్ణయాలతో పాలనలో మెరుగైన ఫలితాలు
-ఆర్టీజీఎస్ సమీక్షలో అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
వైద్యారోగ్యం నుంచి వ్యవసాయం వరకు వివిధ రంగాల్లో ఏఐ సాంకేతికతను వినియోగించుకుని మెరుగైన ఫలితాలు సాధించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. ఆధునిక టెక్నాలజీ, ఏఐ స్టాక్ ద్వారా ప్రభుత్వ సేవలను మరింత సులభతరం చేయడంతో పాటు శాఖల పనితీరు, ప్రభుత్వ ఆదాయాలను మెరుగుపర్చాలని నిర్దేశించారు. రియల్ టైమ్ గవర్నెన్సులో భాగంగా వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో సీఎం పలు కీలక సూచనలు చేశారు. ప్రభుత్వ శాఖలు అందిస్తున్న పౌర సేవలను మరింత సమర్థవంతంగా, వేగంగా అందించేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఉద్యోగుల్లో సామర్థ్యాలను పెంపొందించేందుకు కెపాసిటీ బిల్డింగ్ కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు.

ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం ఉండకూడదు

ప్రభుత్వ సేవలపై ప్రజల్లో సానుకూల అభిప్రాయం ఏర్పడినప్పుడే మరింత మెరుగైన పాలన అందించేందుకు అవకాశం ఉంటుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ ద్వారా ప్రజల నుంచి అందే ఫిర్యాదులను వేగంగా పరిష్కరించాలని అధికారులను సీఎం ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో పర్యవేక్షణ లోపాలను సరిదిద్దుకుంటూ, ప్రతి శాఖ తన పనితీరును నిరంతరం సమీక్షించుకోవాలని ఉన్నతాధికారులకు సూచించారు. రెవెన్యూ, లీగల్ ఏఐ స్టాక్ ద్వారా వివిధ అంశాలను విశ్లేషించి, అత్యుత్తమ పనితీరు సాధించేలా చర్యలు చేపడుతున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. భవిష్యత్తులో డేటా డ్రివెన్ డెసిషన్ మేకింగ్ అత్యంత కీలకంగా మారుతుందని సీఎం స్పష్టం చేశారు. ప్రభుత్వ పనితీరుకు ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు ఒక కొలమానంగా ఉన్నాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. శాఖల ఉన్నతాధికారులు పర్యవేక్షణను మరింత బలోపేతం చేసి, ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా పనిచేయాలని ఆదేశించారు. సమీక్షలో సాంఘిక సంక్షేమ, బీసీ సంక్షేమ, మైనారిటీ సంక్షేమ శాఖలు, ఆర్థిక శాఖ, మున్సిపల్, ఇంధన శాఖల ఉన్నతాధికారులు, ఆర్టీజీఎస్ అధికారులు పాల్గొన్నారు.