సోషల్ మీడియాలో వైఎస్ జగన్, ఆయన కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు.. సైబర్ క్రైమ్ పోలీసులకు వైసీపీ నేతల ఫిర్యాదు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
సోషల్ మీడియాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు పూర్తి వీడియోలు, ఆడియో రికార్డులు, ఇతర ఆధారాలతో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, వైఎస్సార్ సీపీ సోషల్ మీడియా రాష్ట్ర ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ దొడ్డ అంజిరెడ్డి తదితర నాయకులు సైబర్ క్రైమ్ సీఐని కలిసి ఫిర్యాదు అందజేశారు.
మల్లాది విష్ణు మాట్లాడుతూ..
ట్విట్టర్ స్పేస్‌లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆయన సతీమణి వైఎస్ భారతిపై జనసేన నాయకులు అసందర్భమైన, అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. తమ పార్టీ అధినేత వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా వ్యవస్థీకృతంగా వ్యవహరించారని విమర్శించారు. ఈ వ్యవహారానికి సంబంధించిన పూర్తి వీడియో, ఆడియో ఆధారాలను పోలీసులకు అందజేసినట్లు తెలిపారు.
గతంలో వైఎస్సార్ సీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై 800కు పైగా కేసులు నమోదు చేశారని, ఇప్పుడు తమ ఫిర్యాదుపై కూడా పోలీసులు నిష్పక్షపాతంగా స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత అంశాలపై స్పందించవద్దని వైఎస్ జగన్ తమ పార్టీ శ్రేణులకు సూచించినప్పటికీ, 24 గంటలు గడవకముందే జనసేన నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు.
రాష్ట్రంలో మహిళలు, విద్యార్థినుల భద్రతకు సంబంధించిన పలు ఘటనలను ప్రస్తావిస్తూ ప్రభుత్వం మహిళల రక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా రాప్తాడులో విద్యార్థినిపై జరిగిన ఘటనను ప్రస్తావించారు.
దేవినేని అవినాష్ మాట్లాడుతూ..
జనసేన పార్టీకి చెందిన వ్యక్తులు వైఎస్ జగన్ కుటుంబ సభ్యులపై మాట్లాడిన తీరు తీవ్ర అభ్యంతరకరమని అన్నారు. కేవలం మౌఖికంగా ఫిర్యాదు చేయకుండా, అనుచిత వ్యాఖ్యలకు సంబంధించిన పూర్తి ఆధారాలను పోలీసులకు సమర్పించామని తెలిపారు. ట్విట్టర్ స్పేస్‌లో వ్యాఖ్యలు చేసిన వారితో పాటు, కార్యక్రమాన్ని నిర్వహించిన హోస్ట్‌ల వివరాలను కూడా అందజేశామని పేర్కొన్నారు.

మహిళల గౌరవం, భద్రత విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించాలని, మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజకీయాల్లో ప్రత్యక్షంగా లేని మహిళల గురించి మాట్లాడటం మానుకుని, రాజకీయంగా ఎదుర్కోవాలంటే వైఎస్ జగన్‌ను నేరుగా ఎదుర్కోవాలని వ్యాఖ్యానించారు.
దొడ్డ అంజిరెడ్డి మాట్లాడుతూ..
జనసేన పార్టీకి చెందిన కొందరు నాయకులు తమ పార్టీ అధినేత వైఎస్ జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత అంశాలపై స్పందించవద్దని వైఎస్ జగన్ తమ పార్టీ శ్రేణులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. అయినప్పటికీ ట్విట్టర్ స్పేస్ వేదికగా సుమారు 350 మంది పాల్గొని ఇష్టానుసారంగా మాట్లాడారని ఆరోపించారు. ఈ వ్యవహారానికి సంబంధించిన వీడియోలు, ఇతర ఆధారాలను పోలీసులకు అందజేశామని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
24 గంటల్లో పోలీసులు ఈ ఫిర్యాదుపై తగిన చర్యలు తీసుకోకపోతే తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని మల్లాది విష్ణు హెచ్చరించారు. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ సీపీ నాయకులు పోలీసులను కోరారు.