సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి – డిజిటల్ లావాదేవీల్లో జాగ్రత్తలు తప్పనిసరి!

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
నేటి డిజిటల్ యుగంలో ఆన్‌లైన్ బ్యాంకింగ్, UPI లావాదేవీల వినియోగం రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

పొరపాటున వేరే బ్యాంక్ ఖాతాకు డబ్బులు పంపించినా, పంపాల్సిన మొత్తం కంటే ఎక్కువ నగదు ట్రాన్స్‌ఫర్ చేసినా ఆందోళన చెందకుండా వెంటనే సంబంధిత బ్యాంకును లేదా UPI యాప్ కస్టమర్ సపోర్ట్‌ను సంప్రదించి ఫిర్యాదు చేయాలి.

లావాదేవీకి సంబంధించిన Transaction ID లేదా UTR నంబర్, డబ్బులు పంపిన తేదీ, సమయం, మొత్తం వంటి వివరాలను భద్రపరచుకోవాలి. బ్యాంకులో అధికారికంగా ఫిర్యాదు చేసి Complaint Reference Number తప్పనిసరిగా పొందాలి.

అదేవిధంగా, సైబర్ మోసం జరిగినట్లు గుర్తించిన వెంటనే ఆలస్యం చేయకుండా జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930కు ఫిర్యాదు చేయాలి. అలాగే www.cybercrime.gov.in వెబ్‌సైట్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చు.

ముఖ్యంగా డబ్బులు తిరిగి ఇప్పిస్తామని చెప్పే గుర్తుతెలియని వ్యక్తులను నమ్మకూడదని, ఎట్టి పరిస్థితుల్లోనూ OTP, UPI PIN, ATM PIN, బ్యాంకు ఖాతా వివరాలను ఇతరులతో పంచుకోకూడదని సూచిస్తున్నారు.

ప్రజలు డిజిటల్ లావాదేవీలు నిర్వహించే సమయంలో తగిన జాగ్రత్తలు పాటిస్తూ సైబర్ నేరాల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలి. సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండటమే ఆర్థిక భద్రతకు తొలి అడుగు.